బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్ కోసం టీమ్ఇండియా జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నది. వచ్చే నెల 2 నుంచి మొదలయ్యే రెండో టెస్టులో ఎలాగైనా ఇంగ్లండ్‌కు దీటైన పోటీనివ్వాలన్న పట్టుదలతో భారత్ అందుకు తగ్గట్లు సిద్ధమవుతున్నది. తొలి టెస్టును చేజేతులా వదిలిపెట్టుకుని సిరీస్‌లో 0-1తో వెనుకంజలో ఉన్న టీమ్ఇండియా సిరీస్‌లో ముందంజ వేయాలని చూస్తున్నది.
రెండో టెస్టుకు వేదికైన బర్మింగ్‌హామ్‌లో శుక్రవారం క్రికెటర్లు నెట్ ప్రాక్టీస్‌లో బిజీగా గడిపారు. తొలి మ్యాచ్ ఓడిపోయిన ప్రభావం ఏమాత్రం కనిపించకుండా ఒకరికొకరు మద్దతు తెలుపుకుంటూ లోపాలపై దృష్టి సారించారు. నాయక ద్వయం శుభ్‌మన్‌గిల్, రిషబ్ పంత్‌కు త్రోడౌన్ స్పెషలిస్టులు బంతులు విసిరారు.
తొలి టెస్టులో రెండు సెంచరీలతో మంచి ఫామ్‌మీదున్న పంత్ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. వైవిధ్యమైన షాట్లతో ప్రత్యర్థి బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన పంత్ తనదైన రోజున ఎంతటి బౌలర్‌నైనా తుత్తునియలు చేయడంలో ముందుంటాడు. మరోవైపు తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన నేపథ్యంలో లోయార్డర్‌లో వచ్చే సిరాజ్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.
స్టార్ బౌలర్ బుమ్రా ..సహచరులతో కనిపించినా బౌలింగ్ ప్రాక్టీస్ చేయలేదు. రెండో టెస్టులో అతను ఆడుతాడా లేదా అన్నదానిపై ఒకింత సందిగ్ధత కొనసాగుతున్నది. ఒకవేళ రెండో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతినిస్తే అతని స్థానంలో అర్ష్‌దీప్‌సింగ్ అరంగేట్రం చేసే అవకాశముంది. ఈ క్రమంలో అర్ష్‌దీప్‌సింగ్, ఆకాశ్దీప్నకు కోచ్ గంభీర్ సూచనలు ఇస్తూ కనిపించాడు.