T20 World Cup | వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కోసం 15 మంది సభ్యులతో బీసీసీఐ శనివారం భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఏడు ఐపీఎల్ జట్లకు చెందిన ఆటగాళ్లకు మాత్రమే చోటు దక్కింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఒక్క ఆటగాడికి కూడా ఐసీసీ టోర్నీలో ఆడే అవకాశం దక్కలేదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమ్ ఇండియా టిటైల్ కోసం బరిలోకి దిగనున్నది.
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్). ఉన్నారు. ఐపీఎల్‌లోని రెండు జట్ల నుంచి ఏడుగురు ఆటగాళ్లు ప్రపంచకప్‌కు ఎంపికయ్యారు.
టీమ్ ఇండియాకు అత్యధిక ఆటగాళ్లను అందించిన జట్టు ముంబయి ఇండియన్స్. ముంబై నుంచి మొత్తం నలుగురు ఆటగాళ్లు ఎంపికయ్యారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ ఉన్నారు. నలుగురు మ్యాచ్ విన్నర్లు కావడం విశేషం.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు ప్లేయర్లు ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యారు. ఇందులో ఫినిషర్ రింకు సింగ్, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా ఉన్నారు. దేశవాళీ క్రికెట్లో మంచి ప్రదర్శన కనబరిచిన రింకు సింగ్‌కు జట్టులో చోటు దక్కింది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి ఇద్దరు ఆటగాళ్లు ఎంపికయ్యారు. డ్యాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ, వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ ఉన్నారు. ఈ ఇద్దరూ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతారు. పవర్‌ప్లేలో వేగంగా పరుగులు చేస్తూ జట్టుకు శుభారంభం అందించే సామర్థ్యం ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ నుంచి సైతం ఇద్దరు ప్లేయర్లకు భారత జట్టులో చోటు లభించింది. వికెట్ కీపర్ సంజు శాంసన్, ఆల్‌రౌండర్ శివమ్ దూబేను సెలెక్టర్లు ఎంపిక చేశారు. శివమ్ దూబే పవర్ హిట్టింగ్ చేస్తుండగా.. సంజు శాంసన్ వికెట్ కీపింగ్.. డ్యాషింగ్ ఓపెనర్‌గా గుర్తింపు పొందాడు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి కూడా ఇద్దరు ఆటగాళ్లకు జట్టులో చోటు లభించింది. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్, రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఎంపికవగా.. ఇద్దరు ప్రపంచకప్‌లో కీలకపాత్ర పోషించనున్నారు. ఈ ఇద్దరికీ బంతితో పాటు అవసరమైన సమయంలో బ్యాట్‌తోనూ మ్యాచ్ గమనాన్నే మార్చే సామర్థ్యం ఉంది.
గుజరాత్ టైటాన్స్ నుంచి వాషింగ్టన్ సుందర్‌కు భారత జట్టులో చోటు లభించింది. బెస్ట్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పంజాబ్ కింగ్స్ నుంచి కేవలం ఒక ఆటగాడు మాత్రమే ఎంపికయ్యాడు. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్. టీ20ల్లో భారత జట్టుకు అత్యుత్తమ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. డెత్ ఓవర్లలో బౌలింగ్ భారత జట్టుకు కీలకం కానున్నాడు.