హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ క్రికెటర్లపై సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) యాజమాన్యం తీవ్ర వివక్ష చూపిస్తుందని తెలంగాణ డిస్ట్రిక్ అసోసియేషన్(టీడీసీఏ) అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఉప్పల్ స్టేడియం వద్ద టీడీసీఏతో పాటు పలు విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా టీడీసీఏ చీఫ్ అల్లీపురం మాట్లాడుతూ ‘ఇంగ్లండ్‌లో జరిగే హండ్రెడ్ లీగ్ కోసం పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను 2.34 కోట్లతో కొనేందుకు సన్‌రైజర్స్ దగ్గర డబ్బులు ఉంటాయి. మీరు పెట్టే పైసలతో వాళ్లు తిరిగి భారత్‌పై ఉగ్రవాద దాడులు చేస్తున్నారు. కానీ తెలంగాణలోని ప్రతిభావంతులైన ప్లేయర్లకు జట్టులో చోటు ఇచ్చేందుకు మీ దగ్గర డబ్బులు ఉండవు’ అంటూ ప్రశ్నించారు.