Sunny Sandhu : టీ20 ఫార్మాట్ అంటే చాలు కుర్రాళ్లు రెచ్చిపోతున్నారు. నువ్వానేనా అంటూ పోటీపడి మరీ బౌలర్లను ఊచకోత కోస్తున్నారు. దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అమిత్ పస్సీ (Amit Passi) రికార్డు సెంచరీని మరువక ముందే.. తమిళనాడు బ్యాటర్ సన్నీ సంధు (Sunny Sandhu) బౌండరీల మోతతో చెలరేగాడు. ఛేదనలో ప్రత్యర్థి బౌలర్‌కు చుక్కలు చూపిస్తూ ఒకే ఓవర్లో 26 పరుగులు పిండుకొని జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసక ఆటతో చెలరేగిన సన్నీ వరుసగా.. 4, 4, 6, 6, 4 తో తమిళనాడుకు విజయాన్ని కట్టబెట్టాడు.
కుర్రాళ్ల విధ్వసంక ఆటతో రంజుగా సాగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మరో క్రికెటర్ దంచేశాడు. తమిళనాడు బ్యాటర్ సన్నీ సంధు ఆకాశమే హద్దుగా విరుచుకుపడి సౌరాష్ట్ర నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి183 పరుగులు చేసింది. ఛేదనలో ఓపెనర్ సాయి సుదర్శన్(101 నాటౌట్) అజేయ శతకంతో తమిళనాడును గెలుపు దిశగా నడిపాడు.
4️⃣,4️⃣,6️⃣,6️⃣,4️⃣
With 40 required off four overs, Sunny Sandhu turned it around with a game-changing over 🔥
Scorecard ▶️ https://t.co/DlpijtPpFx@IDFCFIRSTBank | #SMAT pic.twitter.com/bkaaSpEl1S
— BCCI Domestic (@BCCIdomestic) December 8, 2025
అయితే.. మిడిలార్డర్ తడబాటుతో సౌరాష్ట్ర పైచేయి సాధించింది. 139కే ఆరు వికెట్లు పడిన వేళ.. క్రీజులోకి వచ్చిన సన్నీ సంధు (30 : 9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ ఆటతో ప్రత్యర్ధి బౌలర్లను బెంబేలెత్తించాడు. చేతన్ సకారియా వేసిన 17వ ఓవర్లో వరుసగా.. 4, 4, 6, 6, 4 బాది 26 పరుగులు రాబట్టాడీ చిచ్చరపిడుగు. సన్నీ మెరుపులతో 18.4 ఓవర్లలోనే తమిళనాడు లక్ష్యాన్ని అందుకుంది.