దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో ఘోరమైన ప్రదర్శన చేస్తున్న టీమిండియాపై మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ అసహనం వ్యక్తం చేశాడు. న్యూజిల్యాండ్ చేతిలో భారత ఓటమికి బ్యాట్స్‌మెన్ భయపడటమే కారణమని విమర్శించాడు. భారత జట్టు బ్యాటింగ్ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన లక్ష్మణ్.. ‘టీ20 క్రికెట్ ఆడటానికి కావలసిని మైండ్ సెట్ అక్కడ లేదు. అక్కడ కనిపించింది ఏంటంటే.. భయపడిన మనస్తత్వం, బ్యాటింగ్.
అనుభవం, ట్యాలెంట్ ఉండి కూడా ఇలా ఆడటం నిరుత్సాహపరిచే ప్రదర్శన’ అని ఈ క్లాసిక్ ప్లేయర్ అభిప్రాయపడ్డాడు. టీ20 క్రికెట్ ఆడేటప్పుడు ధైర్యంగా ఆడాలని, కానీ టీమిండియా ఆటగాళ్ల హావభావాల్లో అనుమానం, అనిశ్చితి కొట్టొచ్చినట్లు కనిపించాయని చెప్పాడు.
‘పవర్‌ప్లేలో రెండు లేదా మూడు వికెట్లు కోల్పోయి, మిడిల్ ఓవర్లలో స్ట్రైక్ రొటేట్ చేయకపోతే డాట్ బాల్స్ పెరిగిపోతాయి. దీంతో మనపై మరింత ఒత్తిడి పడుతుంది. షాట్ల ఎంపిక కూడా సరిగా లేదు’ అని లక్ష్మణ్ వివరించాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌లో అయినా ఈ మనస్తత్వాన్ని మార్చుకోవాలని, అప్పుడే ఆఫ్ఘన్ బౌలర్లపై ఒత్తిడి పెట్టగలుగుతారని అన్నాడు.
ఇప్పుడు టీమిండియా తమ రన్ రేట్‌పై కూడా ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి ఉందన్నాడు. టీమిండియా ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మూడింట్లో భారీ తేడాతో విజయం సాధించినా కూడా టీమిండియా సెమీస్ చేరాలంటే కష్టమే.
ఎందుకంటే మిగతా జట్ల మ్యాచ్‌లలో కూడా భారత్‌కు అనుకూలమైన ఫలితాలు వస్తేనే సెమీస్‌కు వెళ్లగలుగుతుంది. ఈ క్రమంలో ఇక భారత్ సెమీస్‌కు వెళ్లడం దాదాపు అసాధ్యమని మాజీ ఓపెనర్ సెహ్వాగ్ కూడా అభిప్రాయపడ్డాడు.