ధనాధన్‌కు ధమాకాకు రంగం సిద్ధమైంది. మండు వేసవిలో ఐపీఎల్‌ను ఆస్వాదించిన అభిమానులకు ఇప్పుడు టీ20 ప్రపంచకప్ రూపంలో మరో మెగాటోర్నీ రానే వచ్చేసింది. అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా ఫోర్లు, సిక్సర్లతో అలరించేందుకు క్రికెటర్లు కదనోత్సాహంతో ఉన్నారు. గతానికి భిన్నంగా 20 జట్లతో కలయికతో దాదాపు నెల రోజుల పాటు జరుగబోతున్న మెగాటోర్నీ పలు కొత్త రికార్డులకు వేదిక కాబోతున్నది. బేస్‌బాల్, బాస్కెట్‌బాల్‌ను అమితంగా ప్రేమించే అగ్రరాజ్యం అమెరికా గడ్డపై క్రికెట్‌కు ఆదరణ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐదేసి జట్లు నాలుగు గ్రూపులుగా బరిలోకి దిగుతున్న టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్ టైటిల్ ఫెవరేట్లుగా సై అంటున్నాయి. తమదైన రోజున ఎంతటి మేటి జట్టునైనా మట్టికరిపించే టీమ్ఇండియా తమ సుదీర్ఘ కలను సాకారం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నది. ఆతిథ్య అమెరికా, కెనడా పోరుతో మెగాటోర్నీకి ఆదివారం ఉదయం తెరలేవబోతున్నది.
T20 World Cup | న్యూయార్క్: పొట్టి ప్రపంచకప్ పోరుకు సమయం ఆసన్నమైంది. ఆదివారం ఉదయం ఆరు గంటలకు అమెరికా, కెనడా మధ్య పోరుతో టీ20 ప్రపంచకప్ టోర్నీ అధికారికంగా ప్రారంభం కాబోతున్నది. తొలిసారి మెగాటోర్నీకి ఆతిథ్యమిస్తున్న అమెరికా అందుకు తగ్గట్లు భారీ ఏర్పాట్లు చేసింది. డల్లాస్‌లోని గ్రాండ్ ప్రెయరీ స్టేడియంలో సరిహద్దు దేశాలు అమెరికా, కెనడా ముఖాముఖి తలపడనున్నాయి. మరోపోరులో పసికూన పపువా న్యుగినియా.. మాజీ చాంపియన్ వెస్టిండీస్‌ను ఎదుర్కొనుంది. ఇదిలా ఉంటే మెగాటోర్నీలో టైటిల్ ఫెవరేట్‌గా భావిస్తున్న భారత్..ఈ నెల 5న తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో ఆడుతుంది. మొత్తంగా దాదాపు 30 రోజుల వ్యవధిలో టోర్నీలో 55 మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ దశ మ్యాచ్‌లకు అమెరికా ఆతిథ్యమిస్తుండగా, అటు లీగ్‌తో పాటు సూపర్-8, సెమీఫైనల్స్, ఫైనల్ పోరు వెస్టిండీస్ దీవుల్లో జరుగనున్నాయి.
గతానికి భిన్నంగా క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయాలన్న ఐసీసీ ప్రణాళికలో భాగంగా ఈసారి జట్ల ప్రాతినిధ్యాన్ని 20కి పెంచారు. 2022లో టాప్-8లో నిలిచిన జట్లు ఈ మెగాటోర్నీకి నేరుగా అర్హత సాధించాయి. దీనికి తోడు ఆతిథ్య హోదాలో అమెరికా, వెస్టిండీస్ టోర్నీలోకి వచ్చాయి. మిగతా జట్ల విషయానికొస్తే..యూరోపియన్ క్వాలిఫయర్ నుంచి ఐర్లాండ్, స్కాట్లాండ్, అమెరికా క్వాలిఫయర్ నుంచి కెనడా, ఆసియా క్వాలిఫయర్ నుంచి నేపాల్, ఒమన్, ఆఫ్రికా క్వాలిఫయర్ నుంచి నమీబియా, ఉగాండా, ఈస్ట్ ఆసియా పసిఫిక్ క్వాలిఫయర్ నుంచి పపువా న్యుగినియా బెర్తులు దక్కించుకున్నాయి.
ఈ ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు ఐదేసి జట్లతో నాలుగు గ్రూపులుగా విడిపోతాయి. ఇందులో ఒక్కో జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. నాలుగు గ్రూపుల్లో టాప్-2లో నిలిచే జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. ఈ ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి మూడు మ్యాచ్‌లు ఆడుతాయి. టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్లో నిలుస్తాయి.
ప్రపంచకప్‌లో ఏ మ్యాచ్ టై అయినా..ఫలితం కోసం సూపర్ ఓవర్ ఆడిస్తారు. ఒకవేళ సూపర్ ఓవర్ టై అయితే ఫలితం వచ్చే వరకు మళ్లీ ఆడిస్తారు. గ్రూపు దశలో, సూపర్-8 దశలో వర్షం అంతరాయం కల్గిస్తే..ఇరు జట్లు కనీసం ఐదు ఓవర్ల పాటు మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. లేదంటే ఇరు జట్లు పాయింట్లు సమంగా పంచుకుంటాయి. లీగ్ దశతో పాటు సూపర్-8కు రిజర్వ్ డే లేవు. నాకౌట్ దశలో ఫలితం కోసం ఇరు జట్లు కనీసం 10 ఓవర్ల పాటు ఆడాల్సి ఉంటుంది. నాకౌట్ దశలో తొలి సెమీస్‌కు మాత్రం రిజర్వ్ డేను కేటాయించగా, రెండో సెమీస్‌కు, ఫైనల్‌కు ఒక రోజే విరామం ఉండటంతో రెండో సెమీస్‌కు రిజర్వ్ డే లేకుండా పోయింది. అయితే తొలి సెమీస్‌కు మ్యాచ్ ఫలితం తేలేందుకు అదనంగా 190 నిమిషాలు కేటాయించగా, రెండో సెమీస్‌కు 250 నిమిషాలు ఇచ్చారు. దీనికి తోడు ఈసారి కొత్తగా స్టాప్‌క్లాక్‌ను తీసుకొచ్చారు. దీని ప్రకారం ఇరు జట్లు తమ ఇన్నింగ్స్‌ను నిర్ణీత సమయంలో ముగించాల్సి ఉంటుంది. లేకుంటే ఆయా జట్లపై పెనాల్టీ పడుతుంది.
గ్రూపు-ఏ: భారత్, పాకిస్థాన్,
యూఎస్ఏ, కెనడా, ఐర్లాండ్
గ్రూపు-బీ: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్,
నమీబియా, ఒమన్, స్కాట్లాండ్
గ్రూపు-సీ: వెస్టిండీస్, న్యూజిలాండ్,
అఫ్గానిస్థాన్, పపువా న్యుగినియా,ఉగాండా
గ్రూపు-డీ: దక్షిణాఫ్రికా, శ్రీలంక,
బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్