Phil Salt | సెయింట్ లూసియా: టీ20 ప్రపంచకప్ గూప్ దశలో ఒడిదొడుకులకు లోనైన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ కీలకమైన సూపర్-8 స్టేజ్ తొలి మ్యాచ్‌లో మాత్రం చాంపియన్ ఆట ఆడింది. ఈ టోర్నీలో అపజయమన్నదే లేకుండా సాగుతున్న ఆతిథ్య వెస్టిండీస్‌ను ఓడించి సెమీస్ రేసులో ముందంజ వేసింది. విండీస్ నిర్దేశించిన 181 పరుగుల ఛేదనను 17.3 ఓవర్లలోనే అలవోకగా ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఛేదనలో ఆ జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ (47 బంతుల్లో 87 నాటౌట్, 7 ఫోర్లు, 5 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌కు తోడు జానీ బెయిర్ స్టో (26 బంతుల్లో 48 నాటౌట్, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో కరేబియన్ బౌలర్లు తేలిపోయారు. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్.. చార్లెస్ (34 బంతుల్లో 38, 4 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ పావెల్ (17 బంతుల్లో 36, 5 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సాల్ట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
సాల్ట్, బెయిర్ స్టో షో..
భారీ ఛేదనను ఇంగ్లండ్ ధాటిగానే ఆరంభించింది. ఐపీఎల్లో భీకరమైన ఫామ్ కనబర్చిన సాల్ట్.. అదే జోరును ఇక్కడా కొనసాగించాడు. సారథి బట్లర్ (25) నెమ్మదిగా ఆడినా క్రీజులో కుదురుకున్నాక సాల్ట్ రెచ్చిపోయాడు. బట్లర్‌తో పాటు మోయిన్ అలీ (13) నిష్క్రమించినా బెయిర్ స్టో రాకతో అగ్నికి వాయువు తోడైనట్టు అయింది. ఈ ఇద్దరూ విండీస్ బౌలర్లపై పిడుగులా విరుచుకుపడ్డారు. అల్జారీ 14వ ఓవర్లో 6, 4 బాదిన బెయిర్ స్టో.. అకీల్ హోసెన్ 15వ ఓవర్లో 4, 6, 4 సాధించాడు. ఇక రొమారియా షెపర్డ్ 16వ ఓవర్లో తొలి బంతినే బౌండరీగా మలిచి 38 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసిన సాల్ట్.. ఆ తర్వాత 6, 4, 6, 6, 4తో ఇంగ్లండ్ విజయం ఖాయమైంది.
విండీస్ సమిష్టిగా..
బౌలర్లు విఫలమైనా మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ బ్యాటర్లు మాత్రం సమిష్టిగా రాణించారు. వేగంగా ఆడిన బ్రాండన్ కింగ్ (23) గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగినా అతడి స్థానంలో వచ్చిన పూరన్ (36) తో కలిసి చార్లెస్ ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఆటాడుకున్నాడు. చార్లెస్‌ను మోయిన్ అలీ ఔట్ చేశాక క్రీజులోకి వచ్చిన పావెల్.. లివింగ్‌స్టొన్ 15వ ఓవర్లో 3 భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. కానీ అదే ఓవర్లో మార్క్ వుడ్ చేతికి చిక్కాడు. మరుసటి ఓవర్లో పూరన్ కూడా పెవిలియన్ చేరినా ఆఖర్లో షెర్ఫె న్ రూతర్ఫర్డ్ (28 నాటౌట్) దూకుడుగా ఆడి విండీస్‌కు భారీ స్కోరు అందించాడు.
సంక్షిప్త స్కోర్లు:
వెస్టిండీస్ : 20 ఓవర్లలో 180/4 (చార్లెస్ 38, పావెల్ 36, మోయిన్ 1/15, లివింగ్‌స్టొన్ 1/20). ఇంగ్లండ్: 17.3 ఓవర్లలో 181/2 (సాల్ట్ 87 నాటౌట్, బెయిర్‌స్టో 48 నాటౌట్, చేజ్ 1/19, రస్సెల్ 1/21)