కొలంబో: సూపర్-8కు అర్హత సాధించాలంటే తప్పక గెలువాల్సిన పరిస్థితుల్లో పాక్ సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. బుధవారం నమీబియాతో జరిగిన పోరులో పాక్ 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పాక్ ఓపెనర్ ఫర్హాన్(58 బంతుల్లో 100 నాటౌట్, 11ఫోర్లు, 4సిక్స్‌లు) సూపర్ సెంచరీతో చెలరేగిన వేళ 20 ఓవర్లలో 199/3 స్కోరు చేసింది.
మరో ఓపెనర్ ఆయూబ్(14) నిరాశపరిచినా ఫర్హాన్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో పాక్‌కు భారీ స్కోరు అందించడంలో కీలకమయ్యాడు. పసలేని నమీబియా బౌలింగ్‌ను సులువుగా ఎదుర్కొంటూ సాధికారిక ఇన్నింగ్స్ నిర్మించాడు. 57 బంతుల్లో సెంచరీ ఖాతాలో వేసుకున్న ఫర్హాన్.నాలుగో వికెట్‌కు షాదాబ్‌ఖాన్(36నాటౌట్ )తో కలిసి 81 పరుగుల అజేయ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఛేదనలో నమీబియా..ఉస్మాన్ తారీఖ్(4/16), షాదాబ్‌ఖాన్(3/19) ధాటికి 17.3 ఓవర్లలో 97 పరుగులకు కుప్పకూలింది.