T20 World Cup | గ్రూప్ దశలో ఒక్క ఓటమి కూడా లేకుండా టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ చేరిన పాక్‌కు ఆస్ట్రేలియా గట్టి షాకిచ్చింది. సెమీస్‌లో ఆ జట్టును ఓడించి ఇంటికి పంపింది. ఈ విజయంలో ఆసీస్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్, ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ కీలక పాత్ర పోషించారు.
అయితే దీనికన్నా ముందు 177 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే ఆసీస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ తొలి బంతికే గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో డేవిడ్ వార్నర్ జట్టును ఆదుకున్నాడు. అతనిపైనే భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ విమర్శల వర్షం కురిపించాడు.
ఆసీస్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ 8వ ఓవర్లో మొహమ్మద్ హఫీజ్ బౌలింగ్‌కు వచ్చాడు. బౌలింగ్ చేసే సమయంలో బంతి అతని చేయి జారింది. దీంతో పిచ్‌పై రెండుసార్లు బౌన్స్ అయింది. అప్పటికే భారీ షాట్ కొట్టేందుకు క్రీజులో ముందుకొచ్చిన వార్నర్ మరో అడుగు ముందుకేసి ఈ బంతిని సిక్సర్ కొట్టాడు.
అంపైర్లు ఈ బంతిని నోబాల్‌గా ప్రకటించి, ఆసీస్‌కు ఆరు పరుగులు ఇచ్చారు. ఈ బంతిని సిక్సర్‌గా కొట్టడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, ఇలా చేసినందుకు వార్నర్ సిగ్గుపడాలని గంభీర్ విమర్శించాడు. ‘వార్నర్ చాలా హీనమైన క్రీడాస్ఫూర్తి చూపించాడిక్కడ’ అంటూ వార్నర్ షాట్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు.
ఆటలో క్రీడాస్ఫూర్తి చర్చలు ఎక్కువగా చేసే అశ్విన్‌ను కూడా తన ట్వీట్లో కదిలించాడు. ఈ విషయంలో అశ్విన్ అభిప్రాయాన్ని కోరాడు. ఈ ట్వీట్ మరోసారి క్రికెట్లో క్రీడాస్ఫూర్తి సమస్యను లేవనెత్తుతుందని క్రీడాపండితులు అభిప్రాయపడుతున్నారు.
What an absolutely pathetic display of spirit of the game by Warner! #Shameful What say @ashwinravi99? pic.twitter.com/wVrssqOENW
— Gautam Gambhir (@GautamGambhir) November 11, 2021