ఈనెల 2 నుంచి క్రికెట్ అభిమానులను అలరిస్తున్న టీ20 వరల్డ్ కప్‌లో ఒక అంకం ముగిసింది! మంగళవారం వెస్టిండీస్-అఫ్గానిస్థాన్ మ్యాచ్‌తో ఈ టోర్నీలో గ్రూప్ దశకు తెరపడనుంది. ఇప్పటికే సూపర్-8 బెర్తులను ఖరారు చేసుకున్న 8 జట్లు.. రెండు గ్రూపులుగా విడిపోయి అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఒక్కో గ్రూపులో 4 జట్లు.. 3 మ్యాచ్‌లు ఆడనుండగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సెమీస్‌కు చేరతాయి.
T20 World Cup | అంటిగ్వా: మునుపెన్నడూ లేని విధంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలిసారిగా 20 జట్లతో వెస్టిండీస్/అమెరికా సంయుక్త వేదికలుగా నిర్వహిస్తున్న టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ దశకు మంగళవారంతో శుభం కార్డు పడనుంది. సోమవారం బంగ్లాదేశ్.. నేపాల్‌ను ఓడించడంతో పాటు శ్రీలంక నెదర్లాండ్స్‌ను చిత్తు చేయడంతో బంగ్లా తదుపరి రౌండ్‌కు అర్హత సాధించడంతో సూపర్-8 బెర్తులు ఖరారయ్యాయి. దీంతో నేడు వెస్టిండీస్-అఫ్గానిస్థాన్ మధ్య జరిగే పోరు నామమాత్రమే.
బుధవారం నుంచి ఈ టోర్నీలో సూపర్-8 పోరుకు తెరలేవనుంది. గ్రూప్ దశను విజయవంతంగా దాటిన 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయాయి. గ్రూప్-1లో భారత్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ ఉండగా గ్రూప్-2 లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, యూఎస్ఏ ఉన్నాయి. ఈ దశలో ఒక జట్టు తమ గ్రూపులో ఉన్న మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన నిలిచిన రెండు జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.
ప్రతి మ్యాచ్ సవాలే!
ఇకనుంచి ప్రతి జట్టుకూ ఆడబోయే ప్రతి మ్యాచ్ సవాలే కానుంది. పసికూనలు ఇచ్చిన షాకులు, కరేబియన్ గడ్డపై పిచ్‌లు స్పందిస్తున్న తీరును చూస్తే ఇకనుంచి టోర్నీ మరింత రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. గ్రూప్ దశలో పలు మ్యాచ్‌లకు అమెరికా ఆతిథ్యమిచ్చినా సూపర్-8తో పాటు సెమీస్, ఫైనల్స్ విండీస్ లోనే జరుగుతాయి.
భారత్ ఎవరెవరితో?
సూపర్-8లో భారత్ కఠినమైన సవాళ్లనే ఎదుర్కోవాల్సి ఉంది. ఈనెల 20న అఫ్గాన్‌తో ఆడనున్న రోహిత్ సేన.. 22న బంగ్లాతో, 24న ఆస్ట్రేలియాతో తలపడుతుంది. గ్రూప్ దశలో అఫ్గాన్‌తో ఆడిన ఏ ప్రత్యర్థి కూడా మూడంకెల స్కోరు చేయలేదు.భారత ఐసీసీ ట్రోఫీ కలకు ‘అడ్డుకట్ట’ వేస్తున్న కంగారూలు మరోసారి కంగారు పెట్టేందుకూ సిద్ధమవుతున్న నేపథ్యంలో ‘మెన్ ఇన్ బ్లూ’ ఈ గండాన్ని ఎలా దాటుతుందనేది ఆసక్తికరం.
గ్రూప్-1: భారత్, ఆస్ట్రేలియా, అఫ్గాన్థిన్, బంగ్లాదేశ్
గ్రూప్-2: ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, యూఎస్ఏ