T20 World Cup | ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో భారత్ వరుస విజయాల జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఐర్లాండ్‌పై శుభారంభం చేసిన టీమ్ఇండియా ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై చిరస్మరణీయ విజయంతో కదంతొక్కి, ఆతిథ్య అమెరికాను మట్టికరిపించి హ్యాట్రిక్ ఖాతాలో వేసుకుంది. కీలకమైన సూపర్-8కు ముందు పసికూన కెనడాతో భారత్ తలపడనుంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచిన కెనడా..టైటిల్ ఫెవరేట్లలో ఒకటైన భారత్‌కు ఏమాత్రం పోటీనిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్లో సూపర్‌ఫామ్‌తో మెరుపులు మెరిపించిన విరాట్ కోహ్లీ..మెగాటోర్నీలో ఫామ్‌లేమితో
సతమతమవుతుండటం భారత్‌ను ఇబ్బంది పెడుతున్నది. మ్యాచ్ సజావుగా సాగేందుకు వరుణుడు కరుణిస్తాడా అన్నది ప్రశ్నగా మారింది.
టీ20 ప్రపంచకప్ కీలక దశకు చేరుకుంది. అందని ద్రాక్షగా ఊరిస్తూ వస్తున్న పొట్టి కప్‌ను ఎలాగైనా ఒడిసిపట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీమ్ఇండియా వరుస విజయాలతో దూసుకెళుతున్నది. ఇప్పటికే సూపర్-8కు అర్హత సాధించిన భారత్..తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో శనివారం కెనడాతో తలపడనుంది. న్యూయార్క్ నసావు స్టేడియంలో లోస్కోరింగ్ మ్యాచ్‌లను నిలబెట్టుకున్న రోహిత్‌సేన..కెనడాతో అదే సమిష్టి ప్రదర్శన కనబర్చాలని చూస్తున్నది. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ మేనేజ్మెంట్ను కలవరపెడుతున్నది. ఐపీఎల్లోపరుగుల వరద పారించిన కోహ్లీ మెగాటోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఐదు పరుగులకే పరిమితమయ్యాడు. కెప్టెన్ రోహిత్‌శర్మతో కలిసి ఓపెనింగ్‌కు వచ్చిన కోహ్లీ మెరుగైన శుభారంభాలను అందించలేకపోయాడు. కెనడాతో పోరులోనైనా కోహ్లీ గాడిలో పడుతాడా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు స్పిన్ ద్వయం చాహల్, కుల్దీప్యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నది. మూడు మ్యాచ్‌ల్లో జడేజా ఒక వికెట్‌కే పరిమితం కాగా, అక్షర్‌పటేల్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న కెనడా..భారత్‌ను నిలువరిస్తుందా అనేది చూడాలి. పటిష్ఠమైన బ్యాటింగ్ లైనప్ కల్గిన టీమ్ఇండియాను ఎదుర్కొవడం కెనడాకు తలకు మించిన భారమే కానుంది.
వాతావరణం: ఉరుములు, మెరుపులతో శనివారం రోజంతా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి.
జట్ల అంచనా: భారత్: రోహిత్(కెప్టెన్), కోహ్లీ, పంత్, సూర్యకుమార్, దూబే, హార్దిక్, జడేజా, అక్షర్, బుమ్రా/సిరాజ్/కుల్దీప్/అర్ష్‌దీప్‌సింగ్.