పొట్టి ప్రపంచకప్ ఆరంభంలోనే సంచలనాలకు వేదికవుతోంది. ఈసారి 20 జట్లతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ‘పసికూన’లు సైతం సత్తా చాటుతున్నాయి. తొలిరోజు అమెరికా, కెనడా ‘హైస్కోరింగ్ గేమ్’ అభిమానులను ఉర్రూతలూగిస్తే రెండో రోజు నమీబియా, ఒమన్ మధ్య బార్బడోస్ వేదికగా జరిగిన ‘లో స్కోరింగ్ థ్రిల్లర్’ ఫ్యాన్స్‌కు అసలైన టీ20 మజాను పంచింది. ఇరుజట్లూ 109 పరుగులు చేయడానికి నానా తంటాలు పడటంతో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. కానీ ఫలితం నిర్ణయించే ‘సూపర్ ఓవర్’లో అదరగొట్టిన నమీబియానే విజయం వరించింది. ఆ జట్టు ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఓడినా ఒమన్ పోరాటం ఆకట్టుకుంది.
బార్బడోస్: టీ20 ఫార్మాట్ అంటేనే బ్యాటర్ల బాదుడుకు మారుపేరు. కానీ స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లలోనే అసలైన క్రికెట్ మజా ఉంటుందనడానికి మరో నిదర్శనం సోమవారం బార్బడోస్ వేదికగా నమీబియా, ఒమన్ మధ్య జరిగిన మ్యాచ్. గ్రూప్-బిలో ఈ జట్ల మధ్య జరిగిన పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్.. 19.4 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. ఖలీద్ కైల్ (39 బంతుల్లో 34, 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. అనంతరం ఛేదనలో నమీబియా సైతం 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 109 పరుగుల వద్దే ఆగిపోవడంతో మ్యాచ్ ‘టై’ అయింది. సూపర్ ఓవర్లో నమీబియా 21 రన్స్ స్కోరు చేయగా ఒమన్ 10 పరుగులే చేసింది. నమీబియా ఆల్‌రౌండర్, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ డేవిడ్ వీస్ బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించి ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఒమన్ ఇన్నింగ్స్ తొలి రెండు బంతుల్లో రెండు వికెట్లు. 10 పరుగులకే ముగ్గురు ఔట్. నమీబియా పేసర్ ట్రంపెల్మెన్ (4/21) విజృంభణతో ఒమన్ వణికిపోయింది. అతడి ధాటికి ఒమన్ బ్యాటర్లు క్రీజులో నిలవలేక వచ్చినోళ్లు వచ్చినట్టే పెవిలియన్‌కు చేరారు. మధ్య ఓవర్లలో వీస్ (3/28) కూడా రెచ్చిపోవడంతో ఒమన్ కుదేలైంది. ఈ ఇద్దరి ధాటికి ఆ జట్టు బ్యాటర్లలో ఏకంగా ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
స్వల్ప ఛేదనలో నమీబియా సైతం తొలి బంతికే వికెట్ కోల్పోయింది. కానీ ఓపెనర్లు నికోలస్ డేవిన్ (24), జాన్ ఫ్రైలింక్ (48 బంతుల్లో 45, 6 ఫోర్లు) ఆ జట్టును విజయం దిశగా నడిపారు. కానీ కీలక సమయంలో ఒమన్ బౌలర్లు సమిష్టిగా రాణించి నికోలస్‌తో పాటు కెప్టెన్ ఎరాస్మస్ (13), స్మిత్ (8), ఫ్రైలింక్, గ్రీన్ (0) వికెట్ల పడగొట్టి ఆ జట్టుపై ఒత్తిడి పెంచారు. విజయానికి ఆఖరి ఓవర్లో నమీబియా 5 పరుగులు చేయకపోవడంతో ఆట సూపర్ ఓవర్‌కు దారి తీసింది.
సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా తరఫున డేవిడ్ వీస్.. 4,6,2,1 స్కోరు చేయగా ఎరాస్మస్ 4,4 బాదడంతో ఆ జట్టు 21 పరుగులు చేసింది. కానీ ఒమన్.. 2 వికెట్లు కోల్పోయి 10 పరుగులే చేసింది. వీస్ 2 వికెట్లు పడగొట్టాడు.
ఒమన్: 19.4 ఓవర్లలో 109 ఆలౌట్ (ఖలీద్ 34, జీషన్ 22, ట్రంపెల్మెన్ 4/21, వీస్ 3/28).
నమీబియా: 20 ఓవర్లలో 109/6 (ఫ్రైలింక్ 45, డేవిన్ 24, మెహ్రాన్ 3/7, అయాన్ 1/12)