శనివారం 23 జనవరి 2021
Sports - Jan 02, 2021 , 00:55:54

ఉమేశ్‌ స్థానంలో నటరాజన్‌

ఉమేశ్‌ స్థానంలో నటరాజన్‌

ఉమేశ్‌ స్థానంలో చోటు దక్కించుకున్న తమిళనాడు పేసర్‌

మెల్‌బోర్న్‌: భారత యువ పేసర్‌ తంగరసు నటరాజన్‌కు అన్నీ కలిసి వస్తున్నాయి. ఆసీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికైన తమిళనాడు స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి గాయపడటంతో అతడి స్థానాన్ని భర్తీచేసే క్రమంలో టీ20 జట్టులోకి వచ్చిన యార్కర్‌ స్పెషలిస్ట్‌ నటరాజన్‌.. నెల రోజుల వ్యవధిలో టెస్టు జట్టులోనూ స్థానం సంపాదించుకున్నాడు. అధికారికంగా టీ20లకు ఎంపికైనా.. అంతకుముందే వన్డే అరంగేట్రం చేసిన నటరాజన్‌.. నెట్‌బౌలర్‌గా కొనసాగుతూ టెస్టు జట్టులోకి వచ్చాడు. తొలి టెస్టులో షమీ గాయపడటంతో అతడి స్థానం లో శార్దుల్‌ ఠాకూర్‌ను తీసుకోగా.. మెల్‌బోర్న్‌ టెస్టులో గాయపడ్డ ఉమేశ్‌ స్థానంలో నటరాజన్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.

‘బాక్సింగ్‌ డే టెస్టులో గాయపడ్డ ఉమేశ్‌ యాదవ్‌ మిగిలిన రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. అతడి స్థానంలో ఆల్‌ ఇండియా సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ నటరాజన్‌ పేరు సూచించింది’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా ఒక ప్రకటనలో తెలిపారు. గాయపడ్డ షమీ, ఉమేశ్‌ బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో పునరావాసం పొందుతారని అందులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఒక వన్డే, మూడు టీ20లు ఆడిన నటరాజన్‌ నాలుగు మ్యాచ్‌ల్లో కలిపి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా భారత్‌, ఆసీస్‌ మధ్య ఈ నెల ఏడు నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

భారత టెస్టు జట్టు: అజింక్యా రహానే (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), మయాంక్‌, పృథ్వీ, రాహుల్‌, పుజారా, విహారి, గిల్‌, సాహా, పంత్‌, బుమ్రా, సైనీ, కుల్దీప్‌, జడేజా, అశ్విన్‌, సిరాజ్‌, శార్దుల్‌, నటరాజన్‌. 


logo