Syria | హైదరాబాద్, ఆట ప్రతినిధి: మూడు దేశాలు పాల్గొన్న ఇంటర్కాంటినెంటల్ కప్‌ను సిరియా గెలుచుకుంది. హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియం వేదికగా సోమవారం జరిగిన చివరి మ్యాచ్‌లో సిరియా.. 3-0తో భారత్‌ను ఓడించి తొలిసారి ఈ కప్‌ను కైవసం చేసుకుంది. సిరియా తరఫున మహ్మద్ అల్ అస్వద్ 2వ నిమిషంలోనే గోల్ చేయగా రెండో అర్ధభాగం 77వ నిమిషంలో డలెహొ మోహ్సెన్ రెండో గోల్ చేసి ఆ జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు.
ఆట మరికొద్ది (90+6) క్షణాల్లో ముగుస్తుందనగా పాబ్లొ సబ్బగ్ మూడో గోల్ కొట్టి విజయాన్ని పరిపూర్ణం చేశాడు. తొలి మ్యాచ్‌లో మారిషస్‌ను 2-0తో ఓడించిన సిరియా.. భారత్‌కూ షాకిచ్చింది. 2019 ఇంటర్కాంటినెంటల్ కప్‌లో మూడో స్థానంలో నిలిచిన సిరియా.. ఈసారి మాత్రం భారత్‌ను ఓడించి ట్రోఫీ ఎగురేసుకుపోయింది. ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో భారత్ (124) కంటే మెరుగైన ర్యాంకు కలిగినా సిరియా (93)కు భారత గడ్డపై ఓ మేజర్ టైటిల్ నెగ్గడం ఇదే ప్రథమం. ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ట్రోఫీ అందజేశారు.