PV Sindhu | లక్నో: గత రెండేండ్లుగా బీడబ్ల్యూఎఫ్ టైటిల్ వేటలో ఉన్న పీవీ సింధు ఆ కొరతను తీర్చుకునే దిశగా కీలక ముందడుగు వేసింది. లక్నోలో జరుగుతున్న సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఆమె సెమీఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో కష్టమ్మీద నెగ్గిన 18వ ర్యాంకర్ సింధు.. శుక్రవారం ఇక్కడ జరిగిన క్వార్టర్స్‌లో 21-15, 21-17తో డై వాంగ్ (చైనా)పై గెలిచింది.
48 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో సింధు.. అంతగా అనుభవం లేని చైనా అమ్మాయిపై అలవోక విజయం సాధించింది. సెమీస్‌లో ఆమె భారత్‌కే చెందిన ఉన్నతి హుడాతో అమీతుమీ తేల్చుకోనుంది. మరో క్వార్టర్స్‌లో ఉన్నతి 21-16, 21-9తో ఇషికా జైస్వాల్ (యూఎస్ఏ)ను ఓడించి సింధుతో పోరుకు సిద్ధమైంది.
ఇక పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 21-8, 21-19తో మీరబ లువాంగ్(భారత్)ను ఓడించి సెమీస్‌లోకి ప్రవేశించాడు. మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల- తనీషా క్రాస్టో జోడీ, మహిళల డబుల్స్‌లో రెండో సీడ్ త్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ ద్వయం సైతం సెమీస్‌కు అర్హత సాధించాయి.