David Warner : ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) మళ్లీ కెప్టెన్ అయ్యాడు. సుదీర్ఘ కెరీర్లో మాయని మచ్చలా నిలిచిన సాండ్ పేపర్ వివాదం (Sand Paper Scandal) నుంచి ఎట్టకేలకు డేవిడ్ భాయ్ బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ (Sydney Thunder) జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్‌పై నిషేధాన్ని ఎత్తేసిన రెండు వారాల్లోనే సిడ్నీ యాజమాన్యం అతడిని మళ్లీ నాయకుడిగా చేసింది. దాంతో, వచ్చే సీజన్లో ఈ డాషింగ్ బ్యాటర్ క్రిస్ గ్రీన్ స్థానంలో జట్టును నడిపించనున్నాడు.
‘వచ్చే సీజన్లో థండర్స్‌కు కెప్టెన్సీ వహించడం నాకు ఎంతో గొప్ప ఫీలింగ్. బీబీఎల్ సీజన్ ఆరంభంలో నేను థండర్స్‌కు ఆడాను. ఇప్పుడు కెప్టెన్‌గా మళ్లీ ఆ జట్టుకు ఆడబోతున్నందుకు సంతోషంగా ఉంది. జట్టును ముందుండి నడిపించడంతో పాటు నా అనుభవాలను యువ ఆటగాళ్లతో పంచుకుంటాను. అంతేకాదు డ్రెస్సింగ్ రూమ్‌లో మంచి వాతావరణం ఉండేలా చూస్తాను. ఇక.. కెప్టెన్ క్రిస్ గ్రీన్ నిజంగా గొప్ప ప్రతిభావంతుడు. అతడి నాయకత్వ లక్షణాలు అద్భుతం అని వార్నర్ వెల్లడించాడు.
JUST IN: David Warner is a captain! The Bull will lead the @thunderbbl in #BBL14. pic.twitter.com/EMF3EZqg9u
— KFC Big Bash League (@BBL) November 5, 2024
బిగ్‌బాష్ లీగ్ 13వ సీజన్లో సిడ్నీ థండర్ చెత్త ఆటతో అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా వార్నర్ వస్తుండడం ఆ జట్టకు వెయ్యి రెట్ల బలాన్ని ఇవ్వనుంది. 14వ సీజన్ డిసెంబర్ 15వ తేదీన మొదలు కానుంది. అడిలైడ్ స్ట్రయికర్స్ జట్టుతో డిసెంబర్ 17న థండర్ ఢీకొననుంది. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చాంపియన్‌గా నిలిపిన వార్నర్.. ఈసారి సిడ్నీ జట్టుకు ట్రోఫీ అందించే పనిలో నిమగ్నమయ్యాడు.
The Bull goes bang 💥
Presenting the new @ThunderBBL skipper – @davidwarner31! #BBL14 pic.twitter.com/AnjQFqlt7k
— KFC Big Bash League (@BBL) November 6, 2024
ఆస్ట్రేలియా జట్టు 2018 మార్చిలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్ సమయంలో ఆసీస్ ఆటగాడు కామెరూన్ బ్యాన్‌క్రాఫ్ట్ (Cameron Bancraft) సాండ్‌పేపర్‌తో బంతిని రుద్దుతూ కెమెరా కంట పడ్డాడు. అతడిపై విచారణ జరపగా.. బాల్ ట్యాంపరింగ్‌లో వార్నర్, స్టీవ్ స్మిత్‌ల హస్తం కూడా ఉందని తేలింది.
దాంతో, ఆసీస్ ఆటగాళ్లపై మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆస్ట్రేలియా బోర్డు.. వార్నర్, స్మిత్‌లు జాతీయ జట్టుకు కెప్టెన్సీ చేయకుండా జీవితకాల నిషేధం విధించింది. అయితే.. అందులో తన తప్పు లేదని వార్నర్ మొత్తుకున్నా ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు ఆసీస్ బోర్డు వార్నర్‌పై సస్పెన్షన్‌ను ఎత్తేయడంతో 6 ఏండ్ల న్యాయపోరాటం ఫలించింది.