అమరావతి : విద్యుత్ ఛార్జీల (Electricity charges ) సర్దుబాటును వ్యతిరేకిస్తూ ఏపీ కాంగ్రెస్ కమిటీ (AP Congress) మూడు రోజుల పాటు ఏపీలో ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తొలిరోజు విజయవాడలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) నేతృత్వంలో లాంతర్లలతో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఐదు నెలలకే కూటమి ప్రభుత్వం ప్రజలకు చుక్కలు చూపిస్తుందని ఆరోపించారు.
ఇప్పటికే రూ.6వేల కోట్లు భారం మోపడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇది సరిపోదని మరో 11 వేల కోట్ల రూపాయలు పెంచడానికి సిద్ధం అవుతుందని పేర్కొన్నారు. రూ. 17వేల కోట్ల పెంపు భారం ప్రజలపై వేయనుందని ఆరోపించారు. ప్రజలు ఏం పాపం చేశారని, మీకు ఓట్లు వేయడం తప్పా అంటూ నిలదీశారు. వైసీపీ 5 సంవత్సరాల్లో 9 సార్లు 35వేల కోట్ల భారం మోపారని చంద్రబాబు ఆరోపించారని తెలిపారు. అదే చంద్రబాబు వచ్చిన 5 నెలల్లోనే రూ 17 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల వసూళ్లకు దిగడం దారుణమని ఆరోపించారు.