శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 (Article 370) పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. 2019 ఆగస్ట్ 5న జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.
కాగా, కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ప్రత్యేక హోదాను పునరుద్ధరించే తీర్మానాన్ని జమ్ముకశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టారు. ‘జమ్ముకశ్మీర్ ప్రజల గుర్తింపు, సంస్కృతి, హక్కులను కాపాడే ప్రత్యేక హోదా, రాజ్యాంగ హామీ ప్రాముఖ్యతను ఈ శాసనసభ పునరుద్ఘాటిస్తుంది. ఏకపక్ష తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేసింది. జాతీయ ఐక్యత, జమ్ముకశ్మీర్ ప్రజల ఆకాంక్షలు రెండింటినీ కాపాడాలి. ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం ఎన్నికైన ప్రజా ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలి’ అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు.
మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు, సభలో ప్రతిపక్ష నేత సునీల్ శర్మ ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు. ’దేశంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేవాలయం (పార్లమెంట్) ఈ చట్టాన్ని ఆమోదించింది’ అని ఆయన అన్నారు. ఈ తీర్మానం ప్రతులను బీజేపీ సభ్యులు చించారు. పేపర్ ముక్కలను వెల్‌లోకి విసిరారు. లంగేట్ ఎమ్మెల్యే షేక్ ఖుర్షీద్ వెల్ లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు.
అయితే ఈ గందరగోళం మధ్య స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్ ఈ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. అసెంబ్లీలోని మెజారిటీ సభ్యులు దీనికి మద్దతిచ్చారు. దీంతో ఈ తీర్మానాన్ని సభ ఆమోదించింది. గందరగోళం కొనసాగడంతో 15 నిమిషాల పాటు సభ వాయిదా పడింది.