Sachin Tendulkar : లెజెండరీ క్రికెటర్, టీమిండియా మాజీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)కు అరుదైన గౌరవం దక్కింది. 50వ పడిలో అడుగుపెట్టిన అతడికి ఆస్ట్రేలియా క్రికెట్ గొప్ప బహుమతి ఇచ్చింది. సిడ్నీ క్రికెట్(Sydney Cricket Ground) గ్రౌండ్‌లోని ఒఒక గేటుకు సచిన్ టెండూల్కర్ పేరు పెట్టింది. ఈ గౌరవం అందుకున్న ఆస్ట్రేలియన్ కాని తొలి క్రికెటర్‌గా మాస్టర్ బ్లాస్టర్ రికార్డు సృష్టించాడు. సచిన్‌తో పాటు వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా(Brian Lara) పేరును కూడా ఆ గేటుకు పెట్టింది. ఈ గౌరవం పట్ల క్రికెట్ గాడ్ సంతోషం వ్యక్తం చేశాడు.
‘భారత్ తర్వాత సిడ్నీ నా ఫేవరెట్ గ్రౌండ్. 1991- 92లో ఆస్ట్రేలియాలో నా మొదటి పర్యటనతో మొదలు నాకు అక్కడ ఎన్నో గొప్ప జ్ఞాపకాలున్నాయి. నాతో పాటు నా మంచి స్నేహితుడు లారా పేరు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ గౌరవం కల్పించినందుకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, ఆస్ట్రేలియా క్రికెట్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. త్వరలోనే సిడ్నీని సందర్శిస్తాను’ అని సచిన్ తెలిపాడు. బ్రాడ్‌మన్ మెసెంజర్ స్టాండ్, డ్రెస్సింగ్ రూమ్ దగ్గర్లోని మెంబర్స్ పెవిలియన్ స్టాండ్ పక్కన సచిన్ – లారా గేటు ఉంది. ఆస్ట్రేలియన్ గ్రేట్ ప్లేయర్స్ ఆర్థర్ మోరిస్, అలన్ డేవిడ్సన్ పేర్లతో కూడా సిడ్నీ మైదానంలో గేట్లు ఉన్నాయి.
సచిన్ – లారా పేర్లు ఉన్న సిడ్నీ గ్రౌండ్ గేటు
లారా, సచిన్ ఇద్దరూ మంచి స్నేహితులు. 1990వ దశకంలో వీళ్లు పరుగుల వదర పారించారు. సచిన్‌కు సిడ్నీలో గొప్ప రికార్డు ఉంది. 157 సగటుతో అతను పరుగులు సాధించాడు. లారా కూడా తన మొదటి టెస్టు సెంచరీ ఈ గ్రౌండ్‌లోనే చేశాడు. దాంతో ఈ ఇద్దరు లెజెండ్స్‌కు గౌరవ సూచకంగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. క్రికెట్ వీడ్కోలు పలికిన సచిన్, లారా ప్రస్తుతం ఐపీఎల్(IPL 2023)లో కొత్త పాత్ర పోషిస్తున్నారు. ముంబై ఇండియన్స్ కోచింగ్ స్టాఫ్‌గా సచిన్ సేవలందిస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్‌కోచ్‌గా లారా పనిచేస్తున్నాడు. సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar) 16వ సీజన్ ఐపీఎల్లో ముంబై తరఫున ఆరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే.