FIFA World Cup : ఫిఫా మహిళల వరల్డ్ కప్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా(Australia)కు మరో ఓటమి. ప్రపంచ కప్‌లో తొలిసారి సెమీ ఫైనల్ చేరిన ఆ జట్టు కాంస్య పతక(Bronze Medal) పోరులో తడబడింది. ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన స్వీడన్(Sweden) 2-0తో ఆసీస్‌పై గెలుపొందింది. దాంతో ఆస్ట్రేలియా నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. మూడో స్థానంలో నిలిచిన స్వీడన్‌కు ఇది నాలుగో బ్రాంజ్ మెడల్ కావడం విశేషం.
బ్రిస్బేన్‌లోని లాంగ్ పార్క్‌లో జరిగిన మ్యాచ్‌లో స్వీడన్ జోరు కొనసాగించింది. 28వ నిమిషంలో ఆ జట్టుకు పెనాల్టీ లభించింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న ఫ్రిడోలినా రాల్ఫో(Fridolina Rolfo) గోల్ కొట్టింది. ఆ తర్వాత కెప్టెన్ కొసొవరె అస్లానీ(Kosovare Asllani) 60వ నిమిషంలో గోల్ కొట్టి ఆధిక్యాన్ని రెండుకు పెంచింది. దాంతో, సెమీఫైనల్లో 3-1తో ఇంగ్లండ్ చేతిలో కంగుతిన్న ఆసీస్ వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. మరో సెమీస్ పోరులో స్పెయిన్ 2-1తో స్వీడన్‌ను ఓడించి ఫైనల్ చేరింది. రేపు స్పెయిన్, ఇంగ్లండ్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.