Team India : పొట్టి ప్రపంచ కప్ తర్వాత సీనియర్లు తొలి పర్యటనకు రెడీ అవుతున్నారు. శ్రీలంక గడ్డపై టీ20 సిరీస్‌లో దుమ్ము రేపేందుకు స్టార్ ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ సిరీస్‌లో పొట్టి ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఎవరు ఉంటారు? అనేదానిపై సందిగ్ధత నెలకొంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల తర్వాత టీ20 సారథిగా హిట్ అయిన హార్దిక్ పాండ్యా (Hardhik Pandya)ను కాదని మరొకరికి కెప్టెన్సీ అప్పగిస్తారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
పొట్టి ఫార్మాట్లో సంచనాలకు కేరాఫ్ అయిన సూర్యకుమార్ యాదవ్ రేసులో అందరికంటే ముందున్నాడని టాక్. 2026లో స్వదేశంలో జరుగబోయే వరల్డ్ కప్ వరకూ అతడినే సారథిగా కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం.
ఇప్పటవరకూ ఏడు మ్యాచుల్లో మిస్టర్ 360 టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో, అనంతరం దక్షిణాఫ్రికాతో సూర్య సారథ్యంలో టీమిండియా టీ20 సిరీస్‌లు ఆడింది. దాంతో, పొట్టి ఫార్మాట్‌కు అతడైనే సరిగ్గా సరిపోతాడని కొత్త కోచ్ గౌతం గంభీర్ అనుకుంటున్నాడట. ఇదే విషయాన్ని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో గౌతీ చర్చించే అవకాశముంది. ఆ తర్వాతే శ్రీలంకతో టీ20 సిరీస్‌కు కెప్టెన్ ఎవరు? అనేది ప్రకటిస్తారని సమాచారం.