బాసెటెర్రీ: భారత్, వెస్టిండీస్ టీ20 సిరీస్ ఆసక్తికరంగా సాగుతున్నది. మంగళవారం మూడో మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన టీమ్ఇండియా..వెస్టిండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కైల్ మయేర్స్(73) అర్ధసెంచరీతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 164/5 స్కోరు చేసింది. టీమ్ఇండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ విండీస్ ఓపెనర్లు బ్రెండన్ కింగ్(20), మయేర్స్ మెరుగైన శుభారంభం అందించారు. వీర్దిదరు సమయోచితమైన ఆటతీరుతో స్కోరుబోర్డుకు పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ కుదురుకుంటున్న తరుణంలో కింగ్‌ను హార్దిక్ పాండ్యా క్లీన్‌బౌల్డ్ చేయడం ద్వారా తొలి వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన కెప్టెన్ నికోలస్ పూరన్(22), రోవ్‌మన్ పావెల్(23), షిమ్రాన్ హిట్మైర్(20) తలా కొన్ని పరుగులు చేయగా, మయేర్స్ వారికి అండగా నిలిచాడు.
ఓ దశలో టీమ్ఇండియా కట్టడి చేసే ప్రయత్నం చేసినా.. ఆఖర్లో పట్టు వదలడంతో పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా అవేశ్‌ఖాన్ 3 ఓవర్లలో 47 పరుగులు ఇచ్చుకున్నాడు. భువనేశ్వర్‌కుమార్(2/35) రెండు వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా(1/19), అర్ష్‌దీప్‌సింగ్(1/33) ఒక్కో వికెట్ పడగొట్టారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన టీమ్ఇండియా కడపటి వార్తలందే సరికి 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 96 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్‌శర్మ(11) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరుగగా, సూర్యకుమార్ యాదవ్(61 నాటౌట్) అర్ధసెంచరీతో అదరగొట్టాడు.
విండీస్ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ పరుగులు కొల్లగొట్టారు. మైదానం నలువైపులా చూడచక్కని షాట్లతో అలరిస్తూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. మరో ఎండ్‌లో శ్రేయాస్ అయ్యర్ సహకారంతో ఎదురైన బౌలర్‌నల్లా దంచుతూ లక్ష్యాన్ని అంతకంతకు కరిగించుకుంటూ పోయాడు. గత మ్యాచ్‌లాగే ఇరు జట్ల మధ్య మూడో పోరు నిర్దేశిత సమయం కంటే గంటన్నర ఆలస్యంగా మొదలైంది. కాగా సోమవారం అర్ధరాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో విండీస్ ఐదు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఆరు వికెట్లతో టీమ్ఇండియా పతనాన్ని శాసించిన మెక్కాయ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.