BGT 2024-25 : సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో క్వీన్‌స్వీప్.. ఆ వెంటనే ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. ఈ సిరీస్‌లో విజయం సాధిస్తే తప్ప ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) ఫైనల్ ఆడే అవకాశం ఉండదు. ఈ పరిస్థితుల్లో భారత జట్టును ఓపెనింగ్ సమస్య వేధిస్తోంది. పెర్త్ టెస్టులో ఎవరిని ఓపెనర్‌గా పంపాలి? అనేది తలనొప్పిగా మారింది. ఎందుకంటే..? సిరీస్ ఆరంభ పోరుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడు.
రెండోసారి తండ్రికాబోతున్న హిట్‌మ్యాన్ పెర్త్ టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. దాంతో, యశస్వీ జైస్వాల్‌కు జోడీగా ఎవరిని పంపాలి? అనేదానిపై కోచ్ గౌతం గంభీర్, సహాయక సిబ్బందితో కలిసి కసరత్తు చేస్తున్నాడు. కేఎల్ రాహుల్ (KL Rahul) పేరు వినిపిస్తున్నా.. అతడి ప్రస్తుత ఫామ్ అంతగా బాగా లేదని.. ‘రాంచీ టెస్టు’ హీరో ధ్రువ్ జురెల్ (Dhruv Jurel)కు అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) అభిప్రాయ పడుతున్నాడు.
Well Played Dhruv Chand Jurel.pic.twitter.com/pfd4UVxbKg
— r1shab (@rishabgargalt) November 7, 2024
నవంబర్ 22న మొదలయ్యే పెర్త్ టెస్టులో ఓపెనర్‌గా యశస్వీ జైస్వాల్ జతగా ఎవరు భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తారు అనేది త్వరలోనే తెలియనుంది. అయితే.. ఆస్ట్రేలియా ‘ఏ’ జట్టుతో నామమాత్ర టెస్టు మ్యాచ్‌లో విఫలమైన కేఎల్ రాహుల్‌నే ఓపెనర్‌గా పంపేందుకు గౌతీ మొగ్గు చూపుతున్నాడు. కానీ, ఆసీస్ ఏ బౌలర్లకు సమాధానం ఇవ్వలేక రెండు ఇన్నింగ్స్‌ల్లో రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. మరోవైపు జురెల్ కంగారూ కుర్ర బౌలింగ్ దళాన్ని దీటుగా ఎదుర్కొని రెండు (80, 68) అర్ధ శతకాలతో అదరహో అనిపించాడు.
అందుకని అతడి బదులు యువ వికెట్ కీపర్ అయిన ధ్రువ్ జురెల్‌ను యశస్వీతో పాటు ఓపెనర్‌గా పంపాలని సురేశ్ రైనా సూచిస్తున్నాడు.
Enjoyable first time batting on Aussie soil. Looking forward to learning and contributing more! 🇮🇳 pic.twitter.com/zl5vV6cU7x
— Dhruv Jurel (@dhruvjurel21) November 9, 2024
‘రాహుల్‌కు అనుభవం చాలానే ఉంది. అయితే.. రోహిత్ గైర్హాజరీలో జురెల్ కచ్చితంగా భారత జట్టుకు ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడు. ఏమో ఎవరికి తెలుసు.. అతడిని ఓపెనర్‌గా పంపినా పంపొచ్చు. రోహిత్ తిరిగొచ్చాక ఎలాగూ అతడే ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు కదా. అందుకని పెర్త్ టెస్టులో జురెల్‌కు అవకాశం ఇస్తే బాగుంటుంది’ అని రైనా తన మనసులోని మాట చెప్పాడు. రాహుల్‌తో పాటు రంజీ వీరుడు అభిమన్యు ఈశ్వరన్ పేరు కూడా ఓపెనర్ రేసులో ఉన్నాడు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని గంభీర్ బృందం ఖరారు చేసే ఆలోచనలో ఉందని టాక్.
భారత స్క్వాడ్ : రోహిత్ శర్మ(కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రానా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.