అమరావతి : జగన్ ప్రభుత్వం ఫెయిల్ కావాలని ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు నుంచే అంతర్జాతీయ అంశంగా వైసీపీ పాలనపై చంద్రబాబు ( Chandrababu) తప్పుడు ప్రచారం చేశారని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఆరోపించారు. ఈ విషయంలో ఎన్టీఆర్ నటన కంటే చంద్రబాబు నటన మాములుగా లేదని విమర్శించారు. తాడేపల్లి నివాసం నుంచి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ డ్రామా బడ్జెట్(Budget) అని వ్యాఖ్యనించారు. కూటమి ప్రభుత్వం మోసాలు, అబద్ధాలు బయటకు వస్తాయనే ఇంతకాలం బడ్జెట్ పెట్టలేదని విమర్శించారు. అంతేకాకుండా ఇచ్చిన హామీలకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టే విధంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని, గవర్నర్ ప్రసంగంలోనూ అబద్ధాలు చెప్పించారని విమర్షించారు.
వైసీపీ ప్రభుత్వ పాలనపై చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రిమినల్స్‌లా (Organized criminals ) దుష్ప్రచారం చేశారని విమర్శించారు. రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లని, రూ. 12 లక్షల కోట్లని, రూ. 14 లక్షల కోట్లు అప్పులంటూ తప్పుడు ప్రచారం చేశారని దుయ్యబట్టారు.
చివరకు రూ. 6 లక్షల 46 వేల కోట్లు చేసిందని బడ్జెట్లో పొందుపరచారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం కేవలం రూ. 3.13 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసిందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థనూ వైసీపీ హయాంలో సక్రమంగా నిర్వహించామని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో అప్పులు 19శాతం పెరిగితే మా హయాంలో 15శాతం అప్పులు పెరిగాయని వివరించారు.
ఆర్థిక క్రమశిక్షణ పాటించినందుకు మాకు అవార్డు ఇవ్వాలని, రెండు సంవత్సరాలు కోవిడ్ (Covid) ఉన్నప్పటికీ చంద్రబాబు కన్న బెటర్ పాలన అందించామని పేర్కొన్నారు. 2014-19 వరకు చంద్రబాబు పాలనలో 42,183 కోట్లు బకాయి పెట్టిపోగా వైసీపీ వాటిని చెల్లించిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దోచుకోవడమే పనిగా పెట్టుకుందని వైఎస్ జగన్ ఆరోపించారు.