న్యూఢిల్లీ : ఆసియా గేమ్స్ సెలెక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శని, ఆదివారాల్లో జరిగే ఈ ట్రయల్స్‌లో వినేశ్ పాల్గొనేలా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారించిన సర్వోన్నత న్యాయస్థానం, ట్రయల్స్ సమయం దగ్గరపడటంతో ప్రస్తుతానికి వినేశ్‌ను అనుమతిస్తున్నామని స్పష్టం చేస్తూనే, ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు అవలంబించిన విధానంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది.
అంతర్జాతీయ డోపింగ్ నిబంధనల ఉల్లంఘన జరిగినప్పుడు, ఈ వ్యవహారాన్ని కేవలం మాతృత్వానికి సంబంధించిన ఇబ్బందిగా ఢిల్లీ హైకోర్టు చిత్రీకరించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. జనవరిలో ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఐటీఏ) నిర్వహించాల్సిన డోప్ టెస్టుకు వినేశ్ అందుబాటులో లేకపోవడం తీవ్రమైన విషయమని పేర్కొంది.