WWE | హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌కు వేదిక కాబోతున్నది. ఇప్పటికే పలు టోర్నీలకు ఆతిథ్యమిచ్చి అందరి మన్ననలు పొందిన హైదరాబాద్ డబ్ల్యూడబ్ల్యూఈ (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్) పోటీలకు ముస్తాబైంది. సరిగ్గా ఆరేండ్ల తర్వాత భారత్‌లో తొలిసారి డబ్ల్యూడబ్ల్యూఈ పోరుకు సర్వం సిద్ధమైంది. స్థానిక గచ్చిబౌలి స్టేడియంలో పేరెన్నికగన్న ప్రపంచ స్థాయి రెజ్లర్లు అభిమానులను అలరించబోతున్నారు. జాన్ సేనా, జిందర్ మహల్, ఇండస్ షేర్, నటాల్య లాంటి స్టార్ల ఒళ్లు జల్దరించే పోరు హైదరాబాదీలను కట్టిపడేయనుంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: డబ్ల్యూడబ్ల్యూఈ పోటీలకు మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌లో తెరలేవనుంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్పెక్టాకిల్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది.గంట మోగడమే ఆలస్యం..బౌట్లో డిష్యుం..డిష్యుం అంటూ తలపడేందుకు రెజ్లర్లు సై అంటున్నారు. ఇన్నాళ్లు విదేశాల్లో జరిగిన మ్యాచ్‌లను టీవీల్లో చూసిన అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించే సమయం ఆసన్నమైంది. కండబలానికి బుద్ధిబలాన్ని జోడిస్తూ గెలిచేందుకు రెజ్లర్లు చేసే ప్రయత్నాలు ఫ్యాన్స్‌ను కట్టిపడేయనున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానాన్ని పొందిన డబ్ల్యూడబ్ల్యూఈలో ఈ సారి భారత రెజ్లర్లతో పాటు వేర్వేరు దేశాలకు చెందిన ప్రముఖ రెజ్లర్లు సత్తాచాటేందుకు సై అంటున్నారు. ఇప్పటికే తన వైవిధ్యమైన ఆటతీరుతో లెక్కకు మిక్కిలి టైటిళ్లు కొల్లగొట్టిన జాన్సేనా..ఫ్రీకిన్ రోలిన్స్ జతగా బరిలోకి దిగుతున్నాడు. వీరిద్దరు గివోని విన్సీ, లుడ్విగ్ కైసర్తో తలపడనున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ టైటిల్ కోసం ఇండస్ షేర్(సంగా, వీర్), కెవిన్ ఒవెన్స్, సమి జైన్ మధ్య ఫైట్ జరుగుతుంది. మహిళల డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ టైటిల్ కోసం రియా రిప్లే, నటాల్యతో అమీతుమీ తేల్చుకోనుంది. వీరితో పాటు డ్రూ మెక్లెట్రీ, షాంకీ, రింగ్ జనరల్ గుంతర్, జియోనీ విన్సీ బరిలో దిగనున్నారు.
జయహో జిందర్
జిందర్ మహల్..డబ్ల్యూడబ్ల్యూఈలో పోటీపడుతున్న భారత రెజ్లర్. విదేశాల్లో విరివిగా జరిగే డబ్ల్యూడబ్ల్యూఈ పోటీల్లో మన దేశ రెజ్లర్లను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఒకవేళ బరిలోకి దిగినా..పెద్దగా వెలుగులోకి రానే రెజ్లర్లు చాలా మంది. కానీ బాహుబలి గ్రేట్ కాళీ వారసునిగా జిందర్ మహల్ డబ్ల్యూడబ్ల్యూఈలో దుమ్మురేపుతున్నాడు. కెరీర్ తొలి నాళ్లలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్న జిందల్.. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. 2016లో మళ్లీ బౌట్లో అడుగుపెట్టిన జిందర్.. ఎదురైన ప్రత్యర్థినల్లా ఓడిస్తూ
ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో స్టార్ రెజ్లర్లను మహల్ మట్టికరిపించాడు. జెయింట్ మెమోరియల్ బాటిల్ రాయల్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచి సత్తాచాటాడు. స్టార్ రెజ్లర్ ర్యాండీ ఓర్టన్ను ఓడించి టైటిల్ విజేతగా నిలిచాడు. భారత్ నుంచి జిందర్ మహల్‌తో పాటు ఇండస్ షేర్ (వీర్ మహాన్, సంగా) ఉన్నారు.
భారత్ వచ్చేందుకు ఇన్ని రోజులు చాలా ఆసక్తిగా ఎదురుచూశాను. వైవిధ్యమైన సంస్కృతి, సంప్రదాయాల కలబోతైన ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. ఇక్కడి ఆహారాన్ని రుచిచూడటంతో పాటు విభిన్నమైన వ్యక్తులను కలిసేందుకు అవకాశం లభించింది.
– రెజ్లర్ లుడ్విగ్ కైసర్