సాంకేతికంగా ప్లే ఆఫ్స్ రేసులో నిలువాలంటే తప్పగా గెలువాల్సిన పోరులో.. చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు హైదరాబాద్ ఆఖరి బంతికి గట్టెక్కింది! మొదట బ్యాటింగ్‌లో త్రిపాఠి, గార్గ్, పూరన్ రాణించడంతో మంచి స్కోరు చేసిన సన్‌రైజర్స్.. ముంబైని అడ్డుకునేందుకు ఆపసోపాలు పడింది! రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ రాణించడంతో ఒక దశలో సునాయాసంగా గెలుస్తుందనుకున్న ముంబైకి.. ఉమ్రాన్ బ్రేక్స్ వేయగా.. ఆఖర్లో టిమ్ డేవిడ్ పిడుగుల్లాంటి షాట్లతో రైజర్స్‌ను భయపెట్టాడు.
ముంబై విజయానికి 18 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన దశలో నటరాజన్ ఓవర్లో నాలుగు సిక్సర్లు అరుసుకున్న డేవిడ్.. ఆఖరి బంతికి అనూహ్య రీతిలో రనౌట్ కావడంతో రైజర్స్ ఊపిరి పీల్చుకుంది. ఎట్టకేలకు వరుసగా ఐదు పరాజయాల అనంతరం హైదరాబాద్ గెలుపు రుచి చూసింది!
ముంబై: ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సమిష్టిగా సత్తాచాటింది. మొదట బ్యాటింగ్‌లో టాపార్డర్ దంచికొట్టడంతో భారీ స్కోరు చేసిన విలియమ్సన్ సేన.. ఆ తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబైని అడ్డుకుంది. మంగళవారం జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ 3 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత రైజర్స్‌కు ఇది తొలి విజయం కావడం గమనార్హం. మొదట బ్యాటింగ్ చేసిన రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి (44 బంతుల్లో 76; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ప్రియమ్ గార్గ్ (26 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), నికోలస్ పూరన్ (22 బంతుల్లో 38; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు.
ఈ ముగ్గురి విజృంభణతో ఒక దశలో 172/2తో పటిష్ట స్థితిలో కనిపించిన హైదరాబాద్.. మరింత భారీ స్కోరు చేస్తుందనుకుంటే.. ఆఖర్లో ముంబై బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. రమణ్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (36 బంతుల్లో 48; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 43; 5 ఫోర్లు, ఒక సిక్సర్) జట్టుకు శుభారంభాన్నివ్వగా.. టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 46; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రైజర్స్‌ను భయపెట్టాడు. ఆఖర్లో పిడుగుల్లాంటి షాట్లతో ముంబైని గెలిపించినంత పనిచేసిన డేవిడ్ రనౌట్ కావడంతో హైదరాబాద్ ఊపిరి పీల్చుకుంది. మన బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు పడగొట్టాడు. త్రిపాఠికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా బుధవారం కోల్‌కతాతో లక్నో తలపడనుంది.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. ఆశలు అడుగంటిన తర్వాత సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసింది. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను ఓపెనింగ్ నుంచి తప్పించి మిడిలార్డర్లో బరిలోకి దింపింది. మ్యాచ్‌కు ముందు మార్పులు అవసరం లేవన్న హెడ్ కోచ్ టామ్ మూడీ.. తన నిర్ణయాన్ని మార్చుకోగా.. అభిషేక్ శర్మ (9)తో పాటు ప్రియమ్ గార్గ్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. మూడో ఓవర్లో అభిషేక్ ఔట్ కాగా.. గార్గ్‌తో కలిసి రాహుల్ త్రిపాఠి.. ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. సంజయ్ ఓవర్లో రెండు ఫోర్లతో దంచుడు ప్రారంభించిన త్రిపాఠి.. బుమ్రా ఓవర్లో వరుసగా 6,4,4 అరుసుకున్నాడు. గార్గ్ కూడా సిక్సర్ బాదడంతో పవర్ ప్లే (6 ఓవర్లు) ముగిసే సరికి హైదరాబాద్ వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. వీరిద్దరూ పోటీ పడి బౌండ్రీలు కొడుతుండటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
లీగ్‌లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లాడిన హైదరాబాద్.. ఆరు విజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. చివరి మ్యాచ్‌లో పంజాబ్‌తో తలపడనున్న హైదరాబాద్.. ఆ మ్యాచ్‌లో విజయం సాధించడంతో పాటు.. ఇతర జట్ల ఫలితాలు అనుకూలించి రన్‌రేట్ కలిసొస్తేనే ప్లే ఆఫ్స్‌కు చేరనుంది.
సంక్షిప్త స్కోర్లు
హైదరాబాద్: 20 ఓవర్లలో 193/6 (త్రిపాఠి 76, ప్రియమ్ గార్గ్ 42; రమణ్‌దీప్ సింగ్ 3/20), ముంబై: 20 ఓవర్లలో 190/7 (రోహిత్ 48, డేవిడ్ 46; ఉమ్రాన్ 3/23)