హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) దుమ్మురేపింది. కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య శనివారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో హైదరాబాద్ 10 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది. సొంతగడ్డపై తమకు తిరుగులేదని నిరూపిస్తూ హైదరాబాద్ సమష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. సన్‌రైజర్స్ నిర్దేశింంచిన 195 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 184/8 స్కోరుకు పరిమితమైంది. మాథ్యూ షార్ట్(34), ఆయూశ్(30) ఫర్వాలేదనిపించారు. ఇషాన్ మలింగ(3/29), నితీశ్‌కుమార్‌రెడ్డి(2/31) చెన్నై పతనంలో కీలకమయ్యారు. తొలుత అభిషేక్‌శర్మ(22 బంతుల్లో 59, 6ఫోర్లు, 4సిక్స్‌లు), క్లాసెన్(39 బంతుల్లో 59, 6ఫోర్లు, 2సిక్స్‌లు) అర్ధసెంచరీలతో హైదరాబాద్ 20 ఓవర్లలో 194/9 స్కోరు చేసింది. కంబోజ్(3/22), ఓవర్టన్(3/37) మూడేసి వికెట్లు తీశారు.
నిర్దేశిత లక్ష్యాన్ని కాపాడుకోవడంలో హైదరాబాద్ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. గత మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాలను నిర్దేశించినా..పేలవ బౌలింగ్‌తో మ్యాచ్‌లు కోల్పోయిన సన్‌రైజర్స్ ఈసారి అదరగొట్టింది. 195 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో సన్‌రైజర్స్ బౌలర్లు సమిష్టిగా కదంతొక్కారు. ముఖ్యంగా ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్..ఆదిలోనే ఓపెనర్ శాంసన్(7) ఔట్ చేసి చెన్నైని దెబ్బతీయగా, మిడిల్లో మలింగ తన ప్రతాపం చూపించాడు.
గైక్వాడ్(19), షార్ట్(34), సర్ఫరాజ్‌ఖాన్(25)ను మలింగ పెవిలియన్ పంపగా, యువ బౌలర్లు సకీబ్ హుస్సేన్(1/32), ప్రఫుల్ హింగే(1/60) పరిణతి కనబరిచారు. హింగే భారీగా పరుగులు సమర్పించుకున్నా..సకీబ్ వైవిధ్యమైన పేస్‌తో చెన్నై బ్యాటర్లను సింగిల్స్‌కు పరిమితం చేశాడు. మొత్తంగా హైదరాబాద్ బౌలర్ల ధాటికి చెన్నై బ్యాటర్లు లక్ష్యఛేదనలో విఫలమై ఓటమి వైపు నిలువగా, వరుసగా రెండో విజయంతో సన్‌రైజర్స్ నాలుగో స్థానానికి దూసుకెళ్లింది.
టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్..హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. లీగ్‌లో ఫామ్‌లేమితో సతమతమవుతున్న ఓపెనర్ అభిషేక్‌శర్మ..చెన్నైతో పోరులో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ట్రావిస్ హెడ్(23)తో కలిసి జట్టుకు మెరుగైన శుభారంభాన్ని అందించాడు. ముకేశ్ చౌదరి రెండో ఓవర్ తొలి బంతికి సిక్స్‌తో మొదలుపెట్టిన అభిషేక్ అదే జోరు కొనసాగించాడు. హెడ్ జతగా చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మాథ్యూ షార్ట్ వేసిన ఐదో ఓవర్లో అభిషేక్ వీరంగం సృష్టించాడు. వరుసగా మూడు ఫోర్లకు తోడు రెండు భారీ సిక్స్‌లతో 15 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. మరో ఎండ్‌లో అవకాశం కోసం ఎదురుచూసిన హెడ్..ఈసారి ముకేశ్ భరతం పట్టాడు. ఈసారి తన వంతు అన్నట్లు ముకేశ్ లక్ష్యంగా హెడ్ మూడు ఫోర్లతో చెలరేగాడు.
ఇన్నింగ్స్ టాప్ గేర్‌లో దూసుకుపోతున్న తరుణంలో ముకేశ్ దెబ్బ కొట్టాడు. వరుస బంతుల్లో హెడ్‌తో పాటు కెప్టెన్ ఇషాన్ కిషన్(0)ను పెవిలియన్ పంపి చెన్నై శిబిరంలో జోష్ నింపాడు. ఫుల్ టాస్ బంతిని ఆడే క్రమంలో మిడాఫ్‌లో గైక్వాడ్ క్యాచ్‌తో హెడ్ ఔటైతే..కిషన్ అదే రీతిలో ఔటయ్యాడు. దీంతో అప్పటివరకు 75 స్కోరుతో మెరుగ్గా కనిపించిన హైదరాబాద్ పవర్‌ప్లే ముగిసే సరికి 75/2కు చేరుకుంది. ఇక్నణ్నుంచి చెన్నై బౌలర్లు కట్టడి చేసేందుకు పన్నిన వ్యూహాలు ఫలించాయి. ముఖ్యంగా ఓవర్టన్, అన్శుల్ కంబోజ్ పకడ్బందీ బౌలింగ్‌తో సన్‌రైజర్స్ ఒకింత ఒత్తిడిలోకి పడిపోయింది.
ఓవర్టన్ బౌలింగ్‌లో అభిషేక్ నిష్క్రమించగా, అనికేత్(2) కూడా అతన్నే అనుసరిస్తూ పెవిలియన్ చేరాడు. దీంతో సగం ఓవర్లు పూర్తయ్యేసరికి హైదరాబాద్ 112 పరగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో క్లాసెన్ కీలక భూమిక పోషించాడు. లోయార్డర్ బ్యాటర్లతో కలిసి క్లాసెన్ ఇన్నింగ్స్‌కు విలువైన పరుగులు జోడించే ప్రయత్నం చేశాడు. నితీశ్‌కుమార్(12)ను ఔట్ చేసి మరోమారు ఓవర్టన్…చెన్నైని పోటీలోకి తీసుకురాగా, క్లాసెన్ ఓవర్‌కు ఓ బౌండరీ చొప్పున ముందుకు సాగాడు.
ఓవర్టన్కు కొనసాగింపుగా కంబోజ్ కూడా జతకలువడంతో ఒక దశలో హైదరాబాద్‌కు పరుగుల రాక కష్టమైంది. పరిస్థితులకు ఎదురొడ్డి నిలుస్తూ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న క్లాసెన్‌ను పెవిలియన్ పంపిన కంబోజ్..ఆఖర్లో శివాంగ్(12), లివింగ్‌స్టోన్(1) బంతి తేడాతో ఔట్ చేశాడు. మొత్తంగా ఓవర్టన్, కంబోజ్ కట్టడితో హైదరాబాద్ ఆఖరి 5 ఓవర్లలో 40 పరుగులకే పరిమితమైంది.
హైదరాబాద్: 20 ఓవర్లలో 194/9(అభిషేక్ 59, క్లాసెన్ 59, కంబోజ్ 3/22, ఓవర్టన్ 3/37),
చెన్నై: 20 ఓవర్లలో 184/8(షార్ట్ 34, ఆయూశ్ 30, మలింగ 3/29, నితీశ్ 2/31)
