నువ్వు ఫోర్ కొడితే నేను సిక్స్ కొడతా అన్నట్టు సొంతగడ్డపై ఆఖరాటలో సన్‌రైజర్స్ బ్యాటర్లు దంచికొట్టాడు. ఆర్సీబీ బౌలింగ్‌ను ఉతికేస్తూ పరుగుల మోతతో ఉప్పల్ స్టేడియాన్ని ఊపేశారు. దాంతోలీగ్లో మరే జట్టుకు సాధ్యంకాని రీతిలో హైదరాబాద్ ఆరోసారి 250 ప్లస్ స్కోరు చేసింది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో తమను ఓడించిన బెంగళూరుపై గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. అయినా టాప్-2లో నిలిచేంత భారీ విజయం సాధించలేకపోయిన సన్‌రైజర్స్ మూడో స్థానంతో సరిపెట్టింది. ఆఖరాటలో ఓడినా.. మెరుగైన రన్‌రేట్‌తో ఆర్సీబీ టాప్ ప్లేస్ నిలబెట్టుకుంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐపీఎల్19వ సీజన్ లీగ్ దశను సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంతో ముగించింది. ఇషాన్ కిషన్ (46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 79), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56), హెన్రిచ్ క్లాసెన్ (24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 51) విజృంభించడంతో ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 55 పరుగుల తేడాతో ఆర్సీబీని ఓడించింది. తొలుత హైదరాబాద్ 255/4 స్కోరు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ సహా ముగ్గురు 50 ప్లస్ రన్స్ ఇచ్చుకున్నారు. అనంతరం ఛేదనలో ఆర్సీబీ ఓవర్లన్నీ ఆడి 200/4 చేసి ఓడింది. కెప్టెన్ రజత్ పాటిదార్ (39 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 56), వెంకటేశ్ అయ్యర్ (19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 44) జట్టు భారీ తేడాతో ఓడిపోకుండా చూసి టాప్ ప్లేస్ ఖాయం చేశారు. ఇషాన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆర్సీబీ, గుజరాత్, హైదరాబాద్ తలో 18 పాయింట్లతో నిలిచినా.. రన్‌రేట్‌లో వెనుకబడిన హైదరాబాద్ మూడో స్థానానికి పరిమితం అయింది. ఆర్సీబీ, జీటీ ఈ నెల 26న క్వాలిఫయర్-1 ఆడనుండగా.. నాలుగో స్థానంలో నిలిచే జట్టుతో 27న రైజర్స్ ఎలిమినేటర్‌లో పోటీ పడుతుంది.
క్రీజులోకి వచ్చిన బ్యాటర్లంతా పరుగుల వేటలో పోటీ పడటంతో హైదరాబాద్ మరోసారి భారీ స్కోరు చేసింది. ఫ్లాట్ వికెట్‌పై ఆర్సీబీ బౌలర్లంతా తేలిపోవడంతో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసింది. గత రెండు మ్యాచ్‌ల్లో అంతగా ఆకట్టుకోలేకపోయిన ఓపెనర్ అభిషేక్ మళ్లీ ఫామ్ అందుకొని బలమైన పునాది వేశాడు. భువీ వేసిన తొలి ఓవర్లోనే సిక్సర్ల ఖాతా తెరిచి తన ఉద్దేశం ఏంటో చెప్పాడు. నాలుగో ఓవర్లో నాలుగు ఫోర్లు కొట్టిన మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (26)ను రసిఖ్ ధార్ ఓ యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేసి ఆర్సీబీ బ్రేక్ ఇచ్చాడు. రసిఖ్ తర్వాతి ఓవర్లో ఇచ్చిన క్యాచ్‌ను వెంకటేశ్ అయ్యర్ డ్రాప్ చేయడంతో బతికిపోయిన అభి.. ఈ చాన్స్‌ను సద్వినియోగం చేసుకున్నాడు. 63/1తో పవర్ ప్లే ముగిసిన తర్వాత ఓ ఎండ్‌లో ఇషాన్‌ను నిలబెట్టి భారీ షాట్లతో విజృంభించాడు. స్పిన్నర్ సుయాశ్, పేసర్ రొమారియోను టార్గెట్ చేసి రెండేసి సిక్సర్లు కొట్టిన అతను 20 బంత్లులో అర్ధ శతకం అందుకున్నాడు. సుయాశ్ వేసిన తొమ్మిదో ఓవర్లో మరో షాట్‌కు ప్రయత్నించి జోర్డన్ కాక్స్‌కు క్యాచ్ ఇచ్చినా ఆర్సీబీకి పెద్దగా ఉపశమనం దక్కలేదు. అదే ఓవర్లో ఫోర్‌తో స్కోరు వంద దాటించిన ఇషాన్‌తో పాటు క్లాసెన్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న క్లాసెన్.. హేజిల్‌వుడ్ వేసిన 13వ ఓవర్లో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో రెచ్చిపోయిన ఏకంగా 27 రన్స్ రాబట్టి స్కోరు 150 దాటించాడు. మరో ఎండ్‌లో ఇషాన్ కూడా భారీ షాట్లు కొడుతూ 31 బంతుల్లో ఫిఫ్టీ మార్కు దాటాడు. తర్వాత మరింత జోరు పెంచిన అతను రసిఖ్ బౌలింగ్‌లో 6, 4, 4 కొట్టగా.. తన ధాటిని కొనసాగించిన క్లాసెన్ 23 బంత్లులోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. వీళ్ల జోరుకు 16 ఓవర్లకే స్కోరు 200 దాటింది. తర్వాతి ఓవర్లో స్పిన్నర్ కృనాల్ పాండ్యా.. క్లాసెన్‌ను ఔట్ చేసి రెండో మూడో వికెట్‌కు 113 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని ముగించాడు. కానీ, తర్వాతి రెండు బాల్స్‌ను స్టాండ్స్‌కు పంపిన నితీశ్ (29*) హేజిల్‌వుడ్ ఓవర్లో మరో సిక్స్‌తో అలరించాడు. చివరి రెండు ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లు వరుసగా 8, 9 పరుగులే ఇచ్చి ఆఖరి బంతికి ఇషాన్‌ను ఔట్ చేసినా హైదరాబాద్ 250 మార్కు దాటింది.
భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీని 166 పరుగుల్లోపు కట్టడి చేస్తే టాప్-2లో నిలిచే అవకాశం ఉన్నా.. రైజర్స్‌కు ప్రత్యర్థి ఆ చాన్స్ ఇవ్వలేదు. ఛేదనను బెంగళూరు ధాటిగానే ఆరంభించింది. తొలి ఓవర్లోనే కమిన్స్‌కు ఫోర్, సిక్స్‌తో స్వాగతం పలికిన ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ పవర్ ప్లేలో మెరుపులు మెరిపించాడు. స్పిన్నర్ శివంగ్ వేసిన నాలుగో ఓవర్లో 6,4,6,6తో చెలరేగి స్కోరు యాభై దాటించాడు. కానీ, తర్వాతి ఓవర్లో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన ఈషాన్ మలింగ అతడిని ఔట్ చేసి ఆర్సీబీని తొలి దెబ్బకొట్టాడు. తర్వాతి ఓవర్లో విరాట్ కోహ్లీ (15)ని సాకిబ్ పెవిలియన్ చేర్చడంతో అతని ఫ్యాన్స్ అంతా షాకయ్యారు. రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో దూకుడుగా ఆడుతున్న పడిక్కల్ (21)ను తొమ్మిదో ఓవర్లో మలింగ పెవిలియన్ చేర్చడంతో ఆర్సీబీ 94/3తో నిలిచింది. ఇక్కడి నుంచి ఆతిథ్య బౌల కట్టుదిట్టమైన బంతులు వేయడంతో కెప్టెన్ రజత్, కృనాల్ పాండ్యా (41 నాటౌట్) వేగంగా ఆడలేకపోయారు. ఫలితంగా సాధించాల్సిన రన్‌రేట్ భారీగా పెరిగింది. ఒత్తిడిలోనూ క్రమం తప్పకుండా బౌండరీలు కొట్టిన రజత్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. జట్టు టాప్ ప్లేస్‌ను ఖాయం చేసిన తర్వాత 19వ ఓవర్లో పార్ట్‌టైమ్ స్పిన్నర్ హెడ్‌కు వికెట్ ఇచ్చుకున్నాడు. చివరి ఓవర్లో 6,4 కొట్టిన టిమ్ డేవిడ్ (15 నాటౌట్) స్కోరు 200 దాటించాడు.
నగరంలో ఆఖరి మ్యాచ్.. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బరిలో నిలవడంతో ఈ మ్యాచ్‌కు అభిమానులు పోటెత్తారు. రికార్డు స్థాయిలో 36 వేల పైచిలుకు ఫ్యాన్స్‌తో స్టేడియం కిక్కిరిసిపోయింది. మెజారిటీ ఫ్యాన్స్ ఆర్సీబీ, కోహ్లీ జెర్సీలతో కనిపించారు. గ్రౌండ్లో విరాట్ కనిపించినప్పుడల్లా కేరింతలు కొట్టారు. ఆర్సీబీ.. ఆర్సీబీ, కోహ్లీ.. కోహ్లీ నినాదాలతో హోరెత్తించారు. బ్యాటింగ్‌లో కోహ్లీ తక్కువ స్కోరుకే ఔటై నిరుత్సాహపరిచినా.. సన్‌రైజర్స్ ఖతర్నాక్ బ్యాటింగ్‌ను అభిమానులు ఆస్వాదించారు.

9 ఐపీఎల్లో భువనేశ్వర్ ఓ ఇన్నింగ్స్‌లో 50 ప్లస్ రన్స్ ఇచ్చుకోవడం ఇది అత్యధికంగా తొమ్మిదోసారి. షమీ రికార్డును సమం చేశాడు.
6 ఐపీఎల్లో సన్‌రైజర్స్ 250 ప్లస్ స్కోరు చేయడం ఇది అత్యధికంగా ఆరోసారి.
సన్‌రైజర్స్: 20 ఓవర్లలో 255/4 (ఇషాన్ 79, అభిషేక్ 56, క్లాసెన్ 56, రసిఖ్ దార్ 2/52);
బెంగళూరు: 20 ఓవర్లలో 200/4 (రజత్ 56, వెంకటేశ్ 44, ఈషాన్ మలింగ 2/33)
