హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్వదేశానికి తిరుగు పయనమయ్యాడు. వెన్నునొప్పి గాయంతో ఐపీఎల్ తొలి దశ మ్యాచ్‌లకు దూరమైన కమిన్స్ వైద్య పరీక్షల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ తర్వాత జట్టును వీడిన కమిన్స్..క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిర్వహించే పరీక్షల అనంతరం తిరిగి జట్టులో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయం విషయంలో సీఏ గ్రీన్‌సిగ్నల్ ఇస్తే.. కమిన్స్ ఐపీఎల్ రెండో దశ మ్యాచ్‌ల కోసం ఈనెల 17న జట్టుతో కలిసే చాన్స్ ఉన్నట్లు తెలిసింది.
వెన్నునొప్పి గాయంతో నిరుడు జూలై నుంచి బాధపడుతున్న కమిన్స్..ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లోనూ ఒక మ్యాచ్‌కే పరిమితమయ్యాడు. అయితే గాయం నుంచి దాదాపు కోలుకున్నట్లు కనిపిస్తున్న ఈ సీనియర్ పేసర్..సన్‌రైజర్స్‌కు కీలకంగా మారనున్నాడు. తన వైవిధ్యమైన పేస్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో కమిన్స్ ముందుంటాడు. ఈ హైదరాబాద్ కెప్టెన్ గైర్హాజరీలో పేస్ దళాన్ని డేవిడ్ పైన్, ఇషాన్ మలింగ ముందుకు నడిపిస్తున్నారు.