SRH | లక్నో : ఐపీఎల్లో ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారైనా మ్యాచ్‌లు ఇంకా రసవత్తరంగా సాగుతూనే ఉన్నాయి. ఎలాగైనా టాప్-2లో నిలువాలన్న పట్టుదలతో ఉన్న జట్లు ఆ దిశగా పోరాడుతున్నాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 42 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)పై అద్భుత విజయం సాధించింది. గెలిచి టాప్‌లోకి దూసుకెళుదామనుకున్న ఆర్సీబీ ఆశలను వమ్ము చేస్తూ రైజర్స్ సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. తమ సహజశైలికి అనుగుణంగా ఆది నుంచే రైజర్స్ బ్యాటర్లు రెచ్చిపోవడంతో ఆర్సీబీపై భారీ స్కోరు సాధించింది. టాపార్డర్, మిడిలార్డర్ తేడా లేకుండా క్రీజులోకి వచ్చినోళ్లంతా బ్యాట్‌తో వీరవిహారం చేయడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (48 బంతుల్లో 94 నాటౌట్, 7 ఫోర్లు, 5 సిక్సర్లు), అభిషేక్ శర్మ (17 బంతుల్లో 34, 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అనికేత్ వర్మ (9 బంతుల్లో 26, 1 ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు. షెఫర్డ్(2/14) రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. సాల్ట్(62) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. సాల్ట్, కోహ్లీ జోరుతో ఆర్సీబీకి అదిరిపోయే శుభారంభం దక్కినా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. రైజర్స్ బౌలర్ల ధాటికి ఆర్సీబీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కమిన్స్ మూడు వికెట్లు పడగొట్టగా, మలింగ రెండేసి వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
బెంగళూరుతో మ్యాచ్‌లో సన్ రైజర్స్ బ్యాటింగ్ గత సీజన్‌ను గుర్తుచేసింది. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో మినహాయిస్తే ఆ స్థాయిలో హిట్టింగ్ చేయలేక తంటాలు పడ్డ ఎస్ఆర్హెచ్.. సీజన్ చివరి దశలో జూలు విదిల్చింది. క్రీజులోకి వచ్చిన బ్యాటర్ వచ్చినట్టు దూకుడు మంత్రాన్ని పఠించడంతో హైదరాబాద్ స్కోరుబోర్డు బ్రేకుల్లేకుండా దూసుకెళ్లింది. ఆరంభంలో అభిషేక్ రాజేసిన చిచ్చుకు క్లాసెన్ (13 బంతుల్లో 24, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అనికేత్ ఆజ్యం పోయగా.. ఆఖర్లో ఇషాన్ దానిని దావానలంలా మార్చాడు. ట్రావిషేక్ జోడీ తొలి వికెట్‌కు 3.3 ఓవర్లలోనే 50 పరుగులు జోడించి అదిరిపోయే ఆరంభాన్నిచ్చినా ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయారు. ఓపెనర్లు నిష్క్రమించాక ఇషాన్‌తో జతకలిసిన క్లాసెన్ సైతం ధాటిగా ఆడటంతో 9వ ఓవర్లోనే హైదరాబాద్ వంద పరుగుల మార్కును దాటింది. కానీ సుయాష్.. 9వ ఓవర్లో ఐదో బంతికి క్లాసెన్‌ను ఔట్ చేశాడు. క్లాసెన్ స్థానంలో వచ్చిన అనికేత్ సైతం సుయాశ్ 11వ ఓవర్లో 6, 4, 6 బాదాడు. కృనాల్.. అనికేత్‌ను పెవిలియన్‌కు పంపగా నితీశ్ రెడ్డి (4) మరోసారి విఫలమయ్యాడు. అప్పటికే 28 బంతుల్లో అర్ధ శతకం పూర్తిచేసిన ఇషాన్.. మరింత రెచ్చిపోయి ఆడాడు. భువీ ఓవర్లో 4, 6 కొట్టిన అతడు.. దయాల్ ఆఖరి ఓవర్లో మరో బౌండరీ, సిక్సర్ బాదినా శతకానికి 6 పరుగుల దూరంలో ఆగిపోయాడు.
భారీ ఛేదనలో బెంగళూరు కూడా తగ్గలేదు. ఆరంభంలో ఫిల్ సాల్ట్ కాస్త ఇబ్బందిపడ్డా బాదే బాధ్యతలను కోహ్లీ భుజానికెత్తుకున్నాడు. బౌండరీతో పరుగులు వేటను ఆరంభించిన రన్ మిషీన్.. కమిన్స్, హర్షల్ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టాడు. ఇషాన్ మలింగ ఆరో ఓవర్లో కోహ్లీ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టగా అదే ఓవర్లో సాల్ట్.. 4, 6 దంచడంతో పవర్ ప్లేలోనే ఆ జట్టు 72/0గా నిలిచింది. కానీ హర్ష్ దూబే బౌలింగ్‌లో కోహ్లీ.. అభిషేక్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. కోహ్లీ నిష్క్రమణతో సాల్ట్ గేర్ మార్చాడు. రైజర్స్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ సాల్ట్ దూకుడుగా బౌండరీలు బాదడంతో ఒక దశలో ఆర్సీబీ విజయం సాధిస్తుందా అనిపించింది. కానీ కమిన్స్ బౌలింగ్‌లో సాల్ట్ ఔట్ తర్వాత ఆర్సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. పాటిదార్ (18), జితేశ్శర్మ(24), షెఫర్డ్(0), కృనాల్(8), డేవిడ్(1)ఘోరంగా విఫలమయ్యారు. ఆర్సీబీని కట్టడి చేయడంలో కమిన్స్ కీలకంగా వ్యవహరించాడు. తన పేస్ వైవిధ్యంతో కీలక వికెట్లు తీసి ఆర్సీబీ నడ్డివిరిచాడు.
హైదరాబాద్: 20 ఓవర్లలో 231/6 (ఇషాన్ 94*, అభిషేక్ 34, షెపర్డ్ 2/14, కృనాల్ 1/38);
బెంగళూరు: 19.5 ఓవర్లలో 189 ఆలౌట్(సాల్ట్ 62, కోహ్లీ 43, కమిన్స్ 3/28, మలింగ 2/37)