ఆరేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. సీజన్ ఆసాంతం సంచలన విజయాలతో రికార్డు స్కోర్లతో దుమ్మురేపిన ఎస్ఆర్హెచ్.. చెన్నైలోని చెపాక్ వేదికగా ‘క్వాలిఫయర్-2’లో రాజస్థాన్ రాయల్స్‌ను స్పిన్ ఉచ్చులో బంధించి కోల్‌కతాతో ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. బ్యాటింగ్‌లో క్లాసెన్, త్రిపాఠి తప్ప మిగిలినవాళ్లు విఫలమైనా రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకున్న హైదరాబాద్.. యువ స్పిన్నర్లతో రాయల్స్‌ను దెబ్బతీసింది. షాబాజ్, అభిషేక్ మాయాజాలానికి శాంసన్ సేనకు మరోసారి నిరాశే ఎదురైంది. ఐపీఎల్ ఫైనల్లో కేకేఆర్-ఎస్ఆర్హెచ్ తలపడనుండటం ఇదే ప్రథమం.
చెన్నై: ఎన్నాళ్లకెన్నాళ్లకు..! ఐపీఎల్-17లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సంచలన విజయాలతో ప్లేఆఫ్స్‌కు చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. కీలకమైన ‘క్వాలిఫయర్-2’లో భాగంగా చెపాక్ వేదికగా శుక్రవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం అమీతుమీకి సిద్ధమైంది. బ్యాటింగ్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయినా స్పిన్‌కు అనుకూలించే చిదంబరం స్టేడియంలో రాజస్థాన్‌ను తిప్పేసింది.
షాబాజ్ అహ్మద్ (3/23), అభిషేక్ శర్మ (2/24) స్పిన్ మాయాజాలానికి రాయల్స్ దాసోహమైంది. హైదరాబాద్ నిర్దేశించిన 176 పరుగుల ఛేదనలో శాంసన్ సేన.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితమైంది. ధ్రువ్ జురెల్ (35 బంతుల్లో 56 నాటౌట్, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరిపోరాటం చేశాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. హెన్రిచ్ క్లాసెన్ (34 బంతుల్లో 50, 4 సిక్సర్లు), రాహుల్ త్రిపాఠి (15 బంతుల్లో 37, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. షాబాజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.
కోల్‌కతాతో క్వాలిఫయర్-1 మాదిరిగానే రాజస్థాన్‌తోనూ ఎస్ఆర్హెచ్కు శుభారంభం దక్కలేదు. బౌల్ట్ తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ(12)ను ఔట్ చేసి హైదరాబాద్‌కు షాకిచ్చాడు. కానీ వన్ డౌన్లో వచ్చిన రాహుల్ త్రిపాఠి ధాటిగా ఆడాడు. మరో ఎండ్‌లో హెడ్ ఉన్నప్పటికీ త్రిపాఠి.. అశ్విన్ 4వ ఓవర్లో 4,4,6తో రెచ్చిపోయాడు. బౌల్ట్ 5వ ఓవర్లోనూ 6,4 బాదడంతో అతడు వ్యూహం మార్చి స్లో బౌన్సర్‌గా వేసిన మూడో బంతిని థర్డ్ మ్యాన్ దిశగా ఆడగా.. అక్కడే ఉన్న చాహల్ క్యాచ్ పట్టడంతో త్రిపాఠి కథ ముగిసింది.
మార్క్మ్ (1) సైతం ఇదే ఓవర్లో చివరి బంతికి షార్ట్ థర్డ్ మ్యాన్ వద్దే చాహల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ట్రావిస్ హెడ్ (28 బంతుల్లో 34, 3 ఫోర్లు, 1 సిక్స్) గేర్ మార్చే దిశగా సాగుతుండగా శాంసన్.. త్రిపాఠిని ఔట్ చేయడంలో పాటించిన వ్యూహాన్నే ఇక్కడా అమలుచేశాడు. 10వ ఓవర్లో సందీప్ శర్మతో స్లో బంతిని వేయించి టెంప్ట్ చేశాడు. ఆఖరు బంతికి షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా ఆడబోయి అక్కడే ఉన్న అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి నిరాశగా వెనుదిరిగాడు. నితీశ్ రెడ్డి (5) సైతం ఇదే వ్యూహంలో చిక్కి విలవిల్లాడాడు.
99 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్‌ను క్లాసెన్ ఆదుకున్నాడు. ఆరంభంలో ధాటిగానే అతడు తర్వాత వచ్చినవాళ్లు వచ్చినట్టు డగౌట్‌కు వెళ్తుండటంతో అతడు నెమ్మదించాడు. చాహల్‌ను లక్ష్యంగా చేసుకుని చూడచక్కని సిక్సర్లు బాదిన క్లాసెన్.. బౌల్ట్ 18వ ఓవర్లో సింగిల్ తీసి 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. కానీ సందీప్ శర్మ 19వ ఓవర్లో తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్లాసెన్ పోరాటంతో హైదరాబాద్ పోరాడే స్కోరును సాధించింది.
ఛేదనను రాజస్థాన్ నెమ్మదిగానే ఆరంభించింది. క్రీజులో నిలిచేందుకు తంటాలుపడ్డ ఓపెనర్ టామ్ కోహ్లర్ (10)ను కమిన్స్ 4వ ఓవర్లో ఔట్ చేసి సన్‌రైజర్స్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు. కానీ సారథి సంజూ శాంసన్ (10) తో జతకలిసిన జైస్వాల్.. భువీ వేసిన 6వ ఓవర్లో 6,4,4,4తో దంచి స్కోరు వేగాన్ని పెంచే యత్నం చేశాడు. పవర్ ప్లే గా ముగియగానే 8వ ఓవర్లోనే కమిన్స్.. లెఫ్టార్మ్ స్పిన్నర్లు షాబాజ్, అభిషేక్‌ను రంగంలోకి దించి రాయల్స్‌ను మడతపెట్టేశాడు. షాబాజ్ వేసిన 8వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన జైస్వాల్.. లాంగాఫ్ వద్ద సమద్‌కు క్యాచ్ ఇచ్చాడు.
అభిషేక్ 9వ ఓవర్లో శాంసన్ కూడా పుల్‌షాట్ ఆడబోయి లాంగాన్ వద్ద మార్క్మ్ సూపర్ క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. స్పిన్నర్లు వికెట్లు తీయడంతో పాటు పరుగులను నియంత్రించడంతో ఒత్తిడికి గురైన పరాగ్ (6).. షాబాజ్ 12వ ఓవర్లో అభిషేక్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇదే ఓవర్లో నాలుగో బంతికి అశ్విన్ డకౌట్ అయ్యాడు. రాజస్థాన్ భారీ ఆశలు పెట్టుకున్న హెట్మెయర్ (4)ను అభిషేక్ బౌల్డ్ చేయడంతో ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. పావెల్ (6)ను నటరాజన్ పెవిలియన్ చేర్చడంతో రాయల్స్ ఓటమి ఖారారైంది. ఆఖర్లో జురెల్ మెరుపులు మెరిపించినా అతడి పోరాటం రాయల్స్‌ను గట్టెక్కించలేకపోయింది.
3 2018 తర్వాత ఐపీఎల్ ఫైనల్స్‌కు వెళ్లడం సన్‌రైజర్స్‌కు ఇదే మొదటిసారి. మొత్తంగా మూడోసారి.
హైదరాబాద్: 20 ఓవర్లలో 175/9 (క్లాసెన్ 50, రాహుల్ 37, అవేశ్ 3/27, బౌల్ట్ 3/45).
రాజస్థాన్: 20 ఓవర్లలో 139/7 (జురెల్ 56 నాటౌట్, జైస్వాల్ 42, షాబాజ్ 3/23, అభిషేక్ 2/24).