కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ జోరుకు హైదరాబాద్ బ్రేకులు వేసింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి అజేయంగా నిలిచిన హార్దిక్ సేనను సన్‌రైజర్స్ నేలకు దించింది. తొలుత కట్టుదిట్టమైన బౌలింగ్‌తో టైటాన్స్‌ను ఓ మాదిరి స్కోరుకే పరిమితం చేసిన హైదరాబాద్.. ఆనక కెప్టెన్ కేన్ విలియమ్సన్, యువ ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడుతో అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. పేలవ ఫీల్డింగ్‌తో ప్రత్యర్థికి ఇతోధిక సాయం చేసినా.. గుజరాత్ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోగా.. తాజా సీజన్లో రైజర్స్ రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది!
ముంబై: ఐపీఎల్ 15వ సీజన్లో ఓటమి ఎరుగకుండా సాగుతున్న గుజరాత్ టైటాన్స్‌కు.. హైదరాబాద్ పరాజయం రుచి చూపించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన సన్‌రైజర్స్.. సోమవారం జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (42 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. అభినవ్ మనోహర్ (21 బంతుల్లో 35; 5 ఫోర్లు, ఒక సిక్సర్) ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్, భువనేశ్వర్ కుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో పేలవ ఫీల్డింగ్ చేసిన రైజర్స్.. అభినవ్ మనోహర్ ఇచ్చిన మూడు క్యాచ్‌లను నేల పాలు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ 19.1 ఓవర్లలో 2 వికెట్లకు 168 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (46 బంతుల్లో 57; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) యాంకర్ ఇన్నింగ్స్‌తో జట్టును నడిపించగా.. అభిషేక్ శర్మ (32 బంతుల్లో 42; 6 ఫోర్లు), నికోలస్ పూరన్ (18 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ షాట్లతో లక్ష్యాన్ని కరిగించారు. విలియమ్సన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా మంగళవారం చెన్నైతో బెంగళూరు తపలడనుంది.
కేన్ కెప్టెన్ ఇన్నింగ్స్
లక్ష్యం మరీ పెద్దది కాకపోవడంతో.. రైజర్స్ ఛేదనను ఆచితూచి ఆరంభించింది. నాలుగు ఓవర్లలో 11 పరుగులే చేసిన హైదరాబాద్.. ఆ తర్వాత వేగం పెంచింది. షమీ వేసిన ఐదో ఓవర్లో విలియమ్సన్ 6,4 కొట్టగా.. ఫెర్గూసన్ ఆరో ఓవర్లో అభిషేక్ 4,4,4,4 బాదాడు. మంచి బంతులను గౌరవిస్తూ.. ముందుకు సాగిన ఈ జోడీ చెత్త బంతులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించాక అభిషేక్ ఔట్ కాగా.. త్రిపాఠి (17 రిటైర్డ్ హర్ట్).. విలియమ్సన్కు అండగా నిలిచాడు. హార్దిక్ ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో జోరు పెంచిన విలియమ్సన్.. ఫెర్గూసన్ బౌలింగ్‌లో ర్యాంప్ షాట్ ద్వారా సిక్సర్ బాది అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. విజయానికి 24 బంతుల్లో 34 పరుగులు అవసరమైన దశలో విలియమ్సన్ ఔటైనా.. మార్క్మ్ (12 నాటౌట్) అండగా.. నికోలస్ పూరన్ (18 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మిగిలిన పని పూర్తి చేశాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్, హార్దిక్ చెరో వికెట్ పడగొట్టారు.
వైడ్లు, మీస్ ఫీల్డ్‌లు..
లీగ్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ దళంగా పేరున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. సోమవారం పోరులో తీవ్రంగా నిరాశ పరిచింది. ఎక్స్‌ట్రాల రూపంలో 22 పరుగులు సమర్పించుకుంది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ ఏకంగా 17 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. అందులో బ్యాట్‌తో వచ్చినవి ఐదు పరుగులైతే.. మిగిలిన 12 రన్స్ ఎక్స్ట్రాలుగానే ప్రత్యర్థి ఖాతాలో చేరాయి. అయితే భువనేశ్వర్ తన తదుపరి ఓవర్లో శుభ్‌మన్ గిల్ (7)ను ఔట్ చేసి రైజర్స్‌కు శుభారంభాన్నిచ్చాడు. సాయి సుదర్శన్ (11)ను నటరాజన్ బుట్టలో వేసుకోవడంతో పవర్‌ప్లే ముగిసేసరికి గుజరాత్ 51/2తో నిలిచింది.
క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన మాథ్యూ వేడ్ (19)ను ఉమ్రాన్ మాలిక్ ఓ సూపర్ బాల్‌తో పెవిలియన్ పంపాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఉమ్రాన్ సంధించిన బుల్లెట్ నేరుగా వెళ్లి వేడ్ ప్యాడ్‌ను తాకగా.. రివ్యూ అడగకుండానే అతడు డగౌట్ బాట పట్టాడు. మిడిల్ ఓవర్స్‌లో మన బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో హార్దిక్, డేవిడ్ మిల్లర్ (12) వేగంగా ఆడలేకపోయారు. అభినవ్ మనోహర్ క్రీజులోకి వచ్చాక గుజరాత్ స్కోరు బోర్డులో కదలిక వచ్చింది. అభినవ్ ఎడాపెడా బౌండ్రీలతో విరుచుకుపడగా.. మనవాళ్ల చెత్త ఫీల్డింగ్ అతడికి కలిసొచ్చింది. ఒకటికి మూడుసార్లు క్యాచ్ ఔట్ ప్రమాదం నుంచి తప్పించుకున్న అభినవ్.. జట్టుకు పోరాడే స్కోరు సాధించిపెట్టగా.. హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా తొలి అర్ధశతకం తన పేరిట రాసుకున్నాడు.
స్కోరు బోర్డు
గుజరాత్: వేడ్ (ఎల్బీ) ఉమ్రాన్ 19, గిల్ (సి) త్రిపాఠి (బి) భువనేశ్వర్ 7, సుదర్శన్ (సి) విలియమ్సన్ (బి) నటరాజన్ 11, హార్దిక్ (నాటౌట్) 50, మిల్లర్ (సి) అభిషేక్ (బి) జాన్సెన్ 12, అభినవ్ (సి) త్రిపాఠి (బి) భువనేశ్వర్ 35, తెవాటియా (రనౌట్) 6, రషీద్ (బి) నటరాజన్ 0, ఎక్స్‌ట్రాలు: 22, మొత్తం: 20 ఓవర్లలో 162/7. వికెట్ల పతనం: 1-24, 2-47, 3-64, 4-104, 5-154, 6-161, 7-162, బౌలింగ్: భువనేశ్వర్ 4-0-37-2, జాన్సెన్ 4-0-27-1, సుందర్ 3-0-14-0, నటరాజన్ 4-0-34-2, ఉమ్రాన్ 4-0-39-1, మార్క్మ్ 1-0-9-0.
హైదరాబాద్: అభిషేక్ (సి) సుదర్శన్ (బి) రషీద్ ఖాన్ 42, విలియమ్సన్ (సి) తెవాటియా (బి) హార్దిక్ 57, త్రిపాఠి (రిటైర్డ్ హర్ట్) 17, పూరన్ (నాటౌట్) 34, మార్క్మ్ (నాటౌట్) 12, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 19.1 ఓవర్లలో 168/2. వికెట్ల పతనం: 1-64, 1-104*, 2-129, బౌలింగ్: షమీ 4-0-32-0, హార్దిక్ 4-0-27-1, ఫెర్గూసన్ 4-0-46-0, రషీద్ 4-0-28-1, దర్శన్ 2.1-0-22-0, తెవాటియా 1-0-10-0.