అన్ని ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మాజీ సారధి విరాట్ కోహ్లీ.. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో నిరాశపరిచాడు. వచ్చీరావడంతోనే రెండు బౌండరీలు బాదిన అతను.. ఆ తర్వాత షార్ట్ పిచ్ బంతిని సరిగా అంచనా వేయలేక వికెట్ పారేసుకున్నాడు.
ఈ క్రమంలో మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్.. కోహ్లీకి వార్నింగ్ ఇచ్చాడు. ఇకపై ఇలా షార్ట్ పిచ్ బంతులు ఎదుర్కోవడానికి కోహ్లీ సిద్ధంగా ఉండాలన్నాడు. సౌతాఫ్రికాలో కూడా వన్డేల్లో కోహ్లీని ఇలాగే బుట్టలో వేయడానికి సఫారీ పేసర్లు చూశారని సన్నీ గుర్తుచేశాడు. వెస్టిండీస్‌తో తొలి వన్డే ముగిసిన తర్వాత సన్నీ.. ఈ వ్యాఖ్యలు చేశాడు.
షార్ట్ పిచ్ బంతులను కోహ్లీ వదిలేయకుండా హుక్ షాట్‌కు ప్రయత్నించడం బౌలర్లకు అవకాశంలా కనిపిస్తోందని ఈ దిగ్గజ బ్యాటర్ అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో ఇది అంతగా కనిపిచకపోయినా.. పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లీపై బౌలర్లు షార్ట్ పిచ్ దాడి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నాడు. కాగా, వెస్టిండీస్‌తో రెండో వన్డే బుధవారం నాడు జరుగుతుంది. సిరీస్ చివరి మ్యాచ్ శుక్రవారం జరగనుంది.