Sunil Gavaskar : ఇటీవలి కాలంలో సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట విలన్లా మారుతోంది. అనుమతి లేకుండా వారి ఫొటోలు ఉపయోగించడం, వారి గోప్యతకు, వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారు కొందరు నెటిజన్లు. దాంతో.. అలాంటి వారికి చెక్ పెట్టేందుకు, సోషల్ మీడియాలో తమ పేరు, ప్రతిష్ట చెడకుండా చూసుకునేందుకు పలువురు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) సైతం కోర్టు మెట్లెక్కాడు. టీమిండియా లెజెండ్ ఫిర్యాదుతో ఎక్స్, మెటా, గూగుల్ సంస్థలకు శుక్రవారం ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది.
భారత మాజీ ఓపెనర్ సునీల్ గావస్కర్ వీడ్కోలు తర్వాత కామెంటేటర్‌గా అలరిస్తున్న విషయం తెలిసిందే. నిత్యం క్రీడా విశ్లేషణలతో వార్తల్లో నిలిచే గవాస్కర్.. ఈమధ్య టీమిండియా వైఫల్యానికి హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)ను నిందిస్తూ తీవ్ర విమర్శలు చేశాడు. అలానే కొందరు ఆటగాళ్ల ప్రదర్శనను ఎండగట్టాడు కూడా. అయితే.. గౌతీపై, కొందరు ఆటగాళ్లపై అతడు చేయని కొన్ని కామెంట్లను అతడికి ఆపాదిస్తూ కొందరు ఎక్స్, మెటా, గూగుల్‌లో పోస్ట్‌లు పెట్టారు. దాంతో.. తన ఫొటోలను, వీడియోలను దుర్వినియోగం చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు.
Delhi High Court asks Google, Meta, X to act on Sunil Gavaskar’s requests to take down fake content, misuse of his photos
Read more: https://t.co/bhR0gymGAw pic.twitter.com/9FcrtdBXgU
— Bar and Bench (@barandbench) December 12, 2025
తన అనుమతి లేకుండా తన ఫొటోలు, వీడియోలను కొందరు ఎక్స్, మెటా, గూగుల్‌లో పోస్ట్ చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. సన్నీ నమోదు చేసిన ఫిర్యాదపై జస్టిస్ హన్మీత్ ప్రీతమ్ సింగ్ ఆరోరా( Justice Manmeet Pritam Singh Arora) బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. సదరు యూఆర్ఎల్స్ (URL) వివరాలను రెండు రోజుల్లో కోర్టుకు సమర్పించాలని గవాస్కర్‌కు సూచించింది బెంచ్. అనంతరం ఆ యూఆర్ఎల్స్ను ఎక్స్, మెటా, గూగుల్ సంస్థలు తమ వెబ్సైట్లోంచి వారం రోజుల్లో తొలగించాలని ఈమూడు సంస్థలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.