SLW vs PAKW : మహిళల టీ20 వరల్డ్ కప్ తొలి పోరులో పాకిస్థాన్ (Pakistan) జట్టు స్వల్ప స్కోర్‌కే పరిమితం అయింది. ఆసియా కప్ చాంపియన్ శ్రీలంక (Srilanka) స్పిన్నర్ల ధాటికి పాక్ బ్యాటర్లు తేలిపోయారు. సుగంధిక కుమారి(3/19), కెప్టెన్ చమరి ఆటపట్టు (3/18)ల విజృంభణతో వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఒక దశలో జట్టు స్కోర్ 100 దాటితే గగనం అనిపించింది. ఆ దశలో కెప్టెన్ ఫాతిమా సనా ఖాన్(30) అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. ఆఖరి వికెట్‌గా వెనుదిరగడంతో పాకిస్థాన్ 116 పరుగులకే ఆలౌట్ అయింది.
ఆసియా కప్ చాంపియన్‌గా వరల్డ్ కప్ బరిలో నిలిచిన శ్రీలంక తొలి పోరులోనే ప్రత్యర్థిని వణికించింది. షార్జా క్రికెట్ స్టేడియంలో స్పిన్ ఉచ్చు బిగించి పాకిస్థాన్ పని పట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పాక్‌ను సుగంధిక కుమారి(3/19), కెప్టెన్ చమరి ఆటపట్టు(3/18)లు ముప్పతిప్పలు పెట్టారు. మొదట ఓపెనర్లు గుల్ ఫిరోజ్(2), మునీబా అలీ(11)లను ఔట్ చేసిన సుగంధిక లంకకు బ్రేకిచ్చింది.
From 84-8, Fatima Sana rescued Pakistan; but will this score be enough? 🤔 https://t.co/TkaJO1ET95 | #T20WorldCup pic.twitter.com/l4XnUPIVCC
— ESPNcricinfo (@ESPNcricinfo) October 3, 2024
ఆ తర్వాత చమరి సైతం తిప్పేయగా పాక్ అమ్మాయిలు చేతులెత్తేశారు. 13వ ఓవర్లో వరుస బంతుల్లో ఇద్దరిని ఔట్ చేసిన లంక కెప్టెన్ పాక్‌ను దెబ్బ తీసింది. 84కే 8 వికెట్లు పడిన దశలో ఫాతిమా సనా ఖాన్(30) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. మాజీ సారథి నిదా దార్ (23) ఫర్వాలేదనిపించింది. దాంతో.. పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 116 పరుగులకే పరిమితమైంది.