లక్నో: ఒక ఆలయంలోని వందేళ్ల నాటి పురాతన దేవతా విగ్రహం చోరీ అయ్యింది. (Man steals idol) దీని గురించి ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విగ్రహం దొంగతనంపై మనస్తాపం చెందిన ఆలయ పూజారి నిరాహార దీక్ష చేపట్టారు. అయితే దొంగిలించిని వ్యక్తికి చెడు జరుగడంతో క్షమాపణ లేఖతోపాటు ఆ విగ్రహాన్ని తిరిగి ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 23న నవాబ్‌గంజ్‌లోని రామ్ జానకి ఆలయంలో వందేళ్ల నాటి అష్టధాతువు రాధా కృష్ణ విగ్రహం చోరీ అయ్యింది. ఈ సంఘటనపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, పురాతన దేవతా విగ్రహం దొంగతనం పట్ల ఆలయ పూజారి తీవ్ర మనస్తాపం చెందారు. నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. అయితే చోరీ జరిగిన పది రోజుల తర్వాత, జాతీయ రహదారిలోని గౌఘాట్ లింక్ రోడ్డు వద్ద గోనె సంచి ఉండటాన్ని కొందరు గమనించారు. దానిని తెరిచి చూడగా చోరీ విగ్రహంతో పాటు ఒక లేఖ కూడా అందులో ఉంది. ఆ విగ్రహాన్ని గుర్తించి గౌఘట్ ఖల్సా ఆశ్రమానికి తీసుకెళ్లారు.
మరోవైపు విగ్రహాన్ని చోరీ చేసిన దొంగ ఆ లేఖలో క్షమాపణ కోరాడు. ‘అయ్యా పూజారి నేను పెద్ద తప్పు చేశాను. నా అజ్ఞానం కారణంగా గౌఘాట్ నుంచి రాధా కృష్ణ విగ్రహాన్ని దొంగిలించాను. అప్పటి నుంచి నాకు చెడు కలలు వస్తున్నాయి. నా కుమారుడి ఆరోగ్యం కూడా క్షిణించింది. కొంత డబ్బు కోసం నేను నిజంగా తప్పు చేశా. క్షమించమని కోరుతూ విగ్రహాన్ని తిరిగి ఇస్తున్నా. నన్ను, నా పిల్లలను క్షమించమని పూజారిని వేడుకుంటున్నా. విగ్రహాన్ని గుడిలో తిరిగి ఉంచాలని కోరుతున్నా’ అని ఆ లేఖలో పేర్కొన్నాడు. దీంతో పూజారి ఆ విగ్రహాన్ని ఆలయంలో తిరిగి ప్రతిష్టించారు.
కాగా, విగ్రహాన్ని దొంగిలించిన వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు. అతడ్ని గుర్తించేందుకు ఆలయం సమీపంలోని ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.