బార్సిలోనా: గాయంతో బాధపడుతున్న స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ బార్సిలోనా ఓపెన్‌కు దూరమయ్యాడు. తాను పూర్తిగా గాయం నుంచి కోలుకోలేదని, పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు మరింత సమయం పడుతుందని నాదల్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ ఏడాది మొదట్లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో గాయపడ్డ నాదల్ వచ్చే నెలలో మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన కెరీర్లో ఇప్పటికే 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు దక్కించుకున్న ఈ టెన్నిస్ స్టార్ కాలి గాయంతో సతమతమవుతున్నాడు.
‘బార్సిలోనా టోర్నీ నాకు చాలా ప్రత్యేకమైంది. నన్ను దత్తత తీసుకున్న క్లబ్ అది. దీనికి తోడు సొంతగడ్డపై ఆడటం ఎప్పుడైనా గొప్ప అనుభూతి. కానీ గాయం కారణంగా టోర్నీలో పోటీపడలేకపోతున్నాను. పూర్తిగా కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాను’ అని అన్నాడు. సోమవారం నుంచి మొదలవుతున్న బార్సిలోనా ఓపెన్ టోర్నీలో నాదల్ ఇప్పటి వరకు 12సార్లు చాంపియన్‌గా నిలిచాడు. మే 28 నుంచి మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్‌కు దీన్ని సన్నాహక టోర్నీగా భావిస్తారు.