Alexander Zverev | పారిస్: విశ్వక్రీడల్లో పాల్గొనేందుకు పారిస్‌కు వచ్చిన క్రీడాకారులకు ‘ఒలింపిక్ విలేజ్’లో వసతుల లేమి తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని జర్మన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ అలగ్జాండెర్ జ్వెరెవ్ అన్నాడు. ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్వెరెవ్ మాట్లాడుతూ.. ‘నాకు టోక్యో బాగా నచ్చింది. అక్కడ నేను స్వర్ణం గెలిచాను. కానీ ఈ ఏడాది పారిస్‌లోని ఒలింపిక్ గ్రామంలో క్రీడాకారులు వసతుల లేమితో తీవ్ర ఇబ్బందులుపడ్డారు. మాకు అక్కడ సరైన తిండి, నిద్ర లేవు. పడుకోవడానికీ పరిస్థితులు అనుకూలంగా ఉండేవి కాదు. గదుల్లో ఏసీలు లేవు. నాతో పాటు జర్మన్ క్రీడాకారులు అక్కడ చాలా అసౌకర్యంగా గడిపారు’ అని అన్నాడు.
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన జ్వెరెవ్ పారిస్‌లో మాత్రం క్వార్టర్స్‌లోనే నిష్క్రమించాడు. కాగా ఒలింపిక్ గ్రామంలో సదుపాయాలు లేవని ఇదివరకే పలువురు క్రీడాకారులు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. తాజా ఎడిషన్‌లో ఓ స్వర్ణంతో పాటు రెండు పతకాలు గెలిచిన ఇటలీ స్విమ్మర్ థామస్ సెకాన్ ఒలింపిక్ విలేజ్‌లో ఉక్కపోతకు తాళలేక సమీపంలో ఉన్న పార్క్‌లో పడుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. భారత క్రీడాకారుల కోసం కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ 40 పోర్టబుల్ ఏసీలను పంపించిన విషయం తెలిసిందే.
వేధింపులపై న్యాయ పోరాటం
పారిస్: తనపై సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తుతున్న వేధింపులపై అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్ న్యాయ పోరాటానికి సిద్ధమైంది మహిళల 66 కిలోల విభాగంలో బరిలోకి దిగిన ఖెలిఫ్ స్వర్ణం గెలిచిన విషయం తెలిసిందే. అయితే విశ్వక్రీడల్లో తొలి రౌండ్ నుంచే తనను ‘పురుషుడు’ అని ‘ట్రాన్స్‌జెండర్’ అంటూ సోషల్ మీడియాలో వేధించడంపై ఆమె పారిస్‌లోని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఖెలిఫ్ స్పంది స్తూ.. ‘ఒలింపిక్స్ సందర్భంగా నాపై వచ్చిన వార్తలు అనైతికమైనవి. వాటిని న్యాయపోరాటంతో ఎదుర్కోవాలని భావిస్తున్నా. నాపై వేధింపులకు పాల్పడ్డవారి ఆలోచనలు మార్చాలనుకుంటున్నా’ అని తెలిపింది.