గాలె : ఆధునిక క్రికెట్లో ‘ఫాబ్-4’ జాబితాలో ఒకడిగా ఉన్న ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ టెస్టులలో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. శ్రీలంకతో గాలె వేదికగా బుధవారం మొదలైన తొలి టెస్టులో భాగంగా వ్యక్తిగత స్కోరు ఒక్క పరుగు పూర్తిచేయగానే స్మిత్.. ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. పదివేల పరుగుల రికార్డుతో పాటు ఈ మ్యాచ్‌లో స్మిత్ (104 నాటౌట్), ఉస్మాన్ ఖవాజా (147 నాటౌట్) శతకాలతో కదం తొక్కడంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (57) వన్డే తరహా ఆట ఆడాడు. టెస్టు కెరీర్లో 35వ శతకాన్ని పూర్తి చేసిన స్మిత్.. పదివేల పరుగుల ఘనతను అందుకున్న క్రికెటర్లలో 15వ వ్యక్తి. ఆస్ట్రేలియా క్రికెటర్లలో రికీ పాంటింగ్, అలెన్ బోర్డర్, స్టీవ్ వా తర్వాత నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. 205 ఇన్నింగ్స్‌లలో స్మిత్ ఈ రికార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో టెస్టులలో వేగంగా 10వేల పరుగుల రికార్డును చేరుకున్న క్రికెటర్లలో లారా, సచిన్, సంగక్కర (ఈ ముగ్గురూ 195 ఇన్నింగ్స్‌లలో), పాంటింగ్ (196) తర్వాత స్మిత్ ఐదో స్థానంలో ఉన్నాడు.