దుబాయ్: ఆధునిక క్రికెట్లో ఫ్యాబ్-4 క్రికెటర్ల జాబితాలో ఒకడిగా గుర్తింపు దక్కించుకున్న ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వన్డేలకు వీడ్కోలు పలికాడు. చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌తో ముగిసిన తొలి సెమీస్‌లో ఓటమి తర్వాత స్మిత్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. 35 ఏండ్ల స్మిత్.. తన సుదీర్ఘ కెరీర్లో 170 వన్డేలు ఆడి 43.08 సగటుతో 5,800 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలు, 35 అర్ధ శతకాలున్నాయి.
గత దశాబ్దంన్నర కాలంలో ఆస్ట్రేలియా మిడిలార్డర్లో అత్యంత నమ్మదగిన బ్యాటర్‌గా పేరున్న అతడు.. వన్డేలకు వీడ్కోలు పలికినా టెస్టులు, టీ20లలో కొనసాగనున్నాడు. 2010లో లెగ్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన స్మిత్.. ఆస్ట్రేలియా గెలిచిన 2015, 2023 వన్డే ప్రపంచకప్ జట్లలో సభ్యుడిగా ఉన్నాడు. ఫామ్‌తో సంబంధం లేకుండా రాణించే స్మిత్.. మైఖేల్ క్లార్క్ నుంచి 2015లో వన్డే జట్టు పగ్గాలను అందుకుని ఆసీస్‌కు 64 మ్యాచ్‌లలో సారథిగా వ్యవహరించాడు.
తాజాగా ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం నేపథ్యంలో స్మిత్.. చాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్సీ బాధ్యతలు మోశాడు. రిటైర్మెంట్పై స్మిత్ స్పందిస్తూ.. ‘ఇది గొప్ప ప్రయాణం. ఈ ప్రయాణంలో ప్రతీ క్షణాన్నీ ఆస్వాదించా. ఈ ఫార్మాట్లో నాకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలున్నాయి. రెండు వరల్డ్ కప్‌లు నెగ్గిన జట్లలో సభ్యుడిగా ఉన్నా. ఇప్పుడు నా దృష్టంతా టెస్టు క్రికెట్ మీదే. నా మొదటి ప్రాధాన్యం టెస్టులే’ అని తెలిపాడు. స్మిత్ నిర్ణయం అనంతరం క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు ఆసీస్ దిగ్గజాలు అతడి సేవలను కొనియాడారు.