హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో తెలంగాణ ప్లేయర్లు సత్తాచాటాలని ఆకాంక్షిస్తూ హైదరాబాద్‌లో భారీ స్థాయిలో ఒలింపిక్ డే రన్ నిర్వహిస్తున్నట్లు స్టీరింగ్ కమిటీ చైర్మన్ మహేశ్‌గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో ఒలింపిక్ డే రన్ పోస్టర్, టీషర్ట్‌ను ఆయన ఆవిష్కరించారు. ఆదివారం ఉదయం 7 గంటలకు నగరంలోని ఎనిమిది ప్రధాన కూడళ్ల నుంచి ఒలింపిక్ డే రన్ మొదలై..ఎల్బీ స్టేడియంలో ముగుస్తుందని వివరించారు. దాదాపు ఐదువేల మంది ఔత్సాహిక ప్లేయర్లు రన్లో పాల్గొననున్నారు. వీరి కోసం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒలింపిక్ సంఘం మాజీ కోశాధికారి మహేశ్వర్, ఉపాధ్యక్షుడు ప్రేమ్‌రాజ్, బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు బాబురావు తదితరులు పాల్గొన్నారు.