కరీంనగర్ కొత్తపల్లి, సెప్టెంబర్ 11: రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్ బాలబాలికల యోగా చాంపియన్‌షిప్ పోటీలు కరీంనగర్ జిల్లా కేంద్రం కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ టెక్నో సూల్లో శుక్రవారం సందడిగా మొదలయ్యాయి. అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్, జిల్లా ఒలింపిక్ సంఘం ప్రతినిధి వుటుకూరి నరేందర్‌రెడ్డి ప్రారంభించిన ఈ పోటీల్లో 24జిల్లాల నుంచి దాదాపు వెయ్యి మందికిపైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. యోగా పోటీల్లో ఒలింపిక్ స్థాయికి ఎదగాలని నరేందర్ రెడ్డి ఆకాంక్షించారు.
తెలంగాణ యోగా సంఘం చైర్మన్, నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ.. జిల్లా యోగా సంఘం కృషి ఫలితంగా 2004 నుంచి కరీంనగర్ జిల్లా 16సార్లు రాష్ట్రంలోనే ఓవరాల్ చాంపియన్‌గా నిలిచిందన్నారు. జిల్లా నుంచి సిద్ధారెడ్డి, ప్రణీత, యమున తదితరులు దేశానికి ప్రాతినిథ్యం వహించి పలు పతకాలు సాధించారని చెప్పారు. ఈ సందర్భంగా కరీంనగర్, నల్లగొండ జిల్లాల క్రీడాకారులు ప్రదర్శించిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి.