ఏటూరునాగారం, జనవరి 9 : ములుగు జిల్లా ఏటూరునాగారంలో మూడు రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి గిరిజన బాల బాలికల క్రీడోత్సవాల్లో భద్రాచలం ఐటీడీఏ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ప్రతి సంవత్సరం ఐటీడీఏల పరిధిలో నిర్వహించే రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడోత్సవాలు ఏటూరు నాగారంలోని కుమ్రం భీం స్టేడియంలో ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు కొనసాగాయి. ఏటూరునాగారం, భద్రాచలం, ఉట్నూరు, మైదాన ప్రాంత ఐటీడీఏల పరిధిలోని గిరిజన క్రీడాకారులు సుమారు 2వేల మంది ఇందులో పాల్గొన్నారు.
కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్, ఆర్చరీ విభాగంలో పోటీలను నిర్వహించారు. అన్ని క్రీడా విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భద్రాచలం ఐటీడీఏ ఓవరాల్ టైటిల్‌ను దక్కించుకుంది. ఈ మేరకు స్థానిక డిప్యూటీ డైరెక్టర్ జనార్దన్ భద్రాచలం టీమ్‌కు కప్‌ను అందజేశారు. మూడు రోజుల పాటు జరిగిన క్రీడల్లో పాల్గొన్న ఐటీడీఏ పీవో చిత్రమిశ్రా మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. ఓవరాల్‌గా అన్ని విభాగాల్లో ఐటీడీఏ భద్రాచలం ప్లేయర్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.