న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా తనకు భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) చీఫ్ పీటీ ఉష నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ తీవ్ర విమర్శలు చేసింది. అనర్హత వేటుతో దవాఖానలో బెడ్‌పై తనకు ఐవోఏ నుంచి ఆశించిన రీతిలో సహకారం దొరుకలేదని వ్యాఖ్యానించింది. అనుమతి లేకుండానే బెడ్‌పై ఉన్న తనతో దిగిన ఫొటోను పీటీ ఉష సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిందని స్థానిక మీడియాతో అంది. ఇలా చేయడంతోనే మద్దతు ఇచ్చినట్లు కాదని, తెర వెనుక రాజకీయాల వల్లే తాను రెజ్లింగ్ దూరమయ్యానని వినేశ్ చెప్పుకొచ్చింది.
నేటి నుంచే రెండో దశ మ్యాచ్‌లు
అనంతపూర్: భారత స్టార్ క్రికెటర్లు ఆడుతున్న దులీప్ ట్రోఫీలో గురువారం నుంచి రెండో దశ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నది. భారత్, బంగ్లా తొలి టెస్టుకు ముందు జట్టులో చోటు కోల్పోయిన పలువురు ఆటగాళ్లకు రెండో టెస్టులో చోటు దక్కించుకునేందుకు ఇది సువర్ణావకాశం. నాలుగు జట్లు (ఇండియా ఏ, బీ, సీ, డీ)గా విడిపోయిన ఆటగాళ్లు.. సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తొలి టెస్టులో చోటు దక్కినా ఇంకా దులీప్ ట్రోఫీ నుంచి రిలీజ్ కాని సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు తొలి మ్యాచ్‌లో భారీ శతకం చేసిన అతడి తమ్ముడు ముషీర్ ఖాన్, శ్రేయస్ అయ్యర్, మొదటి మ్యాచ్ ఆడనున్న రింకూ సింగ్‌పై అందరి దృష్టి నెలకొని ఉంది.