Mohammad Shami : ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత క్రికెట్ జట్టుకు ఒక శుభవార్త అందింది. స్టార్ పేసర్ మహమ్మద్ షమీ మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. చీలమండ గాయంతో దాదాపు ఏడాదిగా జట్టుకు దూరంగా ఉన్న షమీ.. ఇప్పుడు బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ ఆడబోతున్నాడు. మధ్యప్రదేశ్‌తో రేపు (బుధవారం) జరిగే ఐదో రౌండ్ రంజీ మ్యాచ్‌లో బెంగాల్ తరఫున షమీ బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది.
వాస్తవానికి కర్ణాటకతో జరిగిన నాలుగో రౌండ్ రంజీ మ్యాచ్‌లోనే షమీ బరిలోకి దిగాల్సి ఉండగా.. పూర్తి ఫిట్నెస్ సాధించని కారణంగా అది సాధ్యపడలేదు. ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకొని ఫిట్నెస్ సాధించిన షమీ.. బెంగాల్ తరఫున ఆడేందుకు బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి గ్రీన్ సిగ్నల్ పొందాడు. రంజీ ట్రోఫీలో అతను రిథమ్ అందుకొని మునపటిలా సత్తా చాటితే ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కుతాడు. సిరీస్ మధ్యలోనైనా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంట్రీ ఇస్తాడు.
గత ఏడాది నవంబర్‌లో వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో చివరిసారిగా టీమిండియా తరఫున బరిలోకి దిగిన షమీ.. చీలమండ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దాంతో ఏడాది కాలంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇటీవలే గాయం నుంచి పూర్తిగా కోలుకొని ప్రాక్టీస్ ప్రారంభించాడు. దాంతో న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్ లేదా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు. కానీ ఆ రెండు సిరీస్‌లకు సెలెక్టర్లు ఆయనను ఎంపిక చేయలేదు.
ఇటీవలే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో మహమ్మద్ షమీ రిహాబిలిటేషన్ పూర్తి చేసుకొని ఫిట్నెస్ టెస్ట్ కూడా పాసయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చే ముందు దేశవాళీ క్రికెట్ ఆడుతానని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. రంజీ ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడి సత్తా చాటి.. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతానని అన్నాడు. అయితే ప్రస్తుతం బోర్డర్- గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులోనూ షమీకి చోటు దక్కలేదు. నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్ట్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరగనుంది.