హైదరాబాద్, ఆట ప్రతినిధి : క్రీడలు, సాంకేతికత, ఆవిష్కరణలను ఒకే వేదికపై తీసుకొచ్చిన హ్యాకథాన్ ఘనంగా ముగిసింది. నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో 24 గంటల పాటు నిరంతరాయంగా సాగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు, క్రీడాకారులు, స్టార్టప్‌లు, యువ ఆవిష్కర్తలు పాల్గొని మొత్తం 2,132 ఆవిష్కరణలు రూపొందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జయేశ్ రంజన్.. యువతలో సృజనాత్మకతను వెలికితీసే ఇలాంటి వేదికలు అత్యంత అవసరమని పేర్కొన్నారు.
కరాటే, వాలీబాల్, స్విమ్మింగ్, పెన్సింగ్, పవర్‌లిఫ్టింగ్, చెస్ వంటి 24 క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు.. వాటిలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి వాటికి వినూత్న పరిష్కారాలను ఆవిష్కరించడం గమనార్హం. ఈ ఆవిష్కరణలను ప్రత్యేక స్మారకగ్రంథంగా ప్రచురించనున్నట్టు హ్యాకథాన్ బ్రాండ్ ఓనర్ సందీప్ కుమార్ ముక్తాల తెలిపారు.