Srilanka Cricket Board : వన్డే వరల్డ్ కప్‌లో 2011 రన్నరప్ శ్రీలంక(Srilanka) అంచనాలను అందుకోలేక చతికిలబడుతోంది. వరుస ఓటములతో సెమీస్ రేసులో వెనకబడిన ఆ జట్టు ముంబైలో భారత్ చేతిలో ఘోర పరాభవానికి గురైంది. ఆ ఓటమిని సీరియస్‌గా తీసుకున్న లంక ప్రభుత్వం క్రికెట్ బోర్డు సభ్యులందరిపై వేటు వేసింది. ఏకంగా బోర్డు సభ్యులందరినీ తొలగిస్తున్నట్టు సోమవారం క్రీడా శాఖ మంత్రి రోషన్ రణసింఘే(Roshan Ranasinghe) వెల్లడించాడు.
అంతేకాదు కొత్తగా మధ్యంతర కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 1996 వరల్డ్ కప్‌లో శ్రీలంకను చాంపియన్‌గా నిలిపిన అర్జున రణతుంగ(Arjuna Ranatunga) ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనున్నాడు.
ముంబైలోని వాంఖడేలో నవంబర్ 2న జరిగిన మ్యాచ్‌లో భారత్.. శ్రీలంకపై 302 పరగులు భారీ తేడాతో గెలిచింది. సొంత గడ్డపై జరిగిన ఆసియా కప్ ఫైనల్లో50 రన్స్‌కే ఆలౌటైన శ్రీలంక.. మళ్లీ అదే తడబాటును కనబరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా శుభ్‌మన్ గిల్(92), కోహ్లీ(88), శ్రేయస్ అయ్యర్(82) అర్ధ శతకాలతో కదం తొక్కగా.. కుశాల్ మెండిస్ సేనకు 357 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఛేదనలో భారత పేసర్ షమీ 5 వికెట్లతో లంక బ్యాటర్లను హడలెత్తించాడు. సిరాజ్ 3 వికెట్లు పడగొట్టడంతో లంక 55 రన్స్‌కే కుప్పకూలింది. 302 రన్స్ తేడాతో ఓడిపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం బోర్డు సభ్యులను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. సెమీస్ రేసులోంచి తప్పుకున్న లంక ఢిల్లీలో సోమవారం బంగ్లాదేశ్‌ను ఢీకొననుంది.