SLW vs BANW : మహిళల ఆసియా కప్‌లో ఆతిథ్య శ్రీలంక (Srilanka) బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లోనే బంగ్లాదేశ్(Bangladesh) పై లంక భారీ విజయం సాధించింది. దంబుల్లా స్టేడియంలో బంగ్లాను బంతితో వణికించిన శ్రీలంక.. ఆ తర్వాత బ్యాటుతోనూ బాదేసి విజయ గర్జన చేసింది. ఓపెనర్ విష్మి గుణరత్నే (52) హాఫ్ సెంచరీతో కదం తొక్కగా.. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సొంతగడ్డపై చమరి ఆటపట్టు సేన టైటిల్ వేటను ఘనంగా మొదలెట్టింది.
స్వదేశంలో జరుగుతున్న ఆసియా కప్‌లో శ్రీలంకకు అదిరే ఆరంభం లభించింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన లంక గ్రూప్ బిలోని బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచిన బంగ్లాను బౌలర్లు బెంబేలెత్తించారు. పవర్ ప్లేలోనే నాలుగు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేశారు. ఆ దశలో కెప్టెన్ నిగర్ సుల్తానా (48 నాటౌట్) అద్భుత పోరాటంతో బంగ్లా కోలుకుంది.
Nigar Sultana Joty’s unbeaten 48 has given Bangladesh something to bowl at. The pitch is offering spin – can they come out in the second half and defend this score? 🤔#WomensAsiaCup2024 #ACC #HerStory #SLWvBANW pic.twitter.com/XlgRYzW11P
— AsianCricketCouncil (@ACCMedia1) July 20, 2024
అయితే.. ఆమెకు సహరించేవాళ్లు కరువయ్యారు. దాంతో, నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 118 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని లంక ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్ విష్మి గుణరత్నే(52) మెరుపు ఇన్నింగ్స్ ఆడి శుభారంభాన్ని ఇచ్చింది. ఆ తర్వాత హర్షిత సమరవిక్రమ(33), కవిశ దిల్హరి(12 నాటౌట్)లు జట్టును విజయ తీరాలకు చేర్చారు.