BCCI : ఇండియన్ ప్రీమియర్ లీగ్ యజమానులతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సమావేశంపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. కానుంది. జూలై నెలాఖరున ముంబైలో పది ఫ్రాంచైజీ ఓనర్లను బీసీసీఐ పెద్దలు కలువనున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈమధ్యే డిజైన్ చేసిన బీసీసీఐ ఆఫీసులో జూలై 30 లేదా జూలై 31వ తేదీనఈ సమావేశం జరుగనుంది.
ఈ భేటీలో మెగా వేలం ఎప్పుడు నిర్వహించాలి? ఒక్కో ఫ్రాంచైజీ ఎంతమందిని అట్టిపెట్టుకోవాలి? వేలం ప్రక్రియలో ఎంత ఖర్చు చేయాలి? వంటి విషయాలు ప్రధానంగా చర్చించే అవకాశముంది. ఐపీఎల్లో ప్రతి ఫ్రాంచైజీ కనీసం 8 మందిని రీటైన్ చేసుకునే వీలుంది. అయితే.. వచ్చే సీజన్లో అట్టిపెట్టుకునే ఆటగాళ్ల సంఖ్యను తగ్గించాలని కొన్ని జట్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు మెగా వేలంలో అనుసరించబోయే రైట్ టు మ్యాచ్ నియమంపై కూడా బీసీసీఐతో ఐపీఎల్ వర్గాలు చర్చించనున్నాయి.
ఐపీఎల్ సీఈఓ హేమంగ్ అమిన్ (Hemang Amin) ఇప్పటికే పది జట్ల యజమానులతో ఈ విషయాలపై మాట్లాడాడు. బీసీసీఐ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశాలను ఆయనకు వాళ్లు తెలియజేశారు. ఇక వేలంలో రికార్డు ధరపై అన్ని ఫ్రాంచైజీలు ఓ మాట అనుకోనున్నాయి. ఈసారి అత్యధిక ధర రూ.20 కోట్లకు మించకపోవచ్చని అంచనా. అంతేకాదు అట్టిపెట్టుకునే ఆటగాళ్లకు చెల్లించాల్సిన జీతాలపై కూడా ఆయా ఫ్రాంచైజీలతో బీసీసీఐ చర్చించనుంది. దాంతో, నెలాఖరున జరుగబోయే ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.